న్యూఢిల్లీ: నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో అంకుర సంస్థలు ఆర్థికంగా మరింత మెరుగైన వ్యాపార విధానాలను పాటించాల్సిన అవసరం నెలకొందని, ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితులు, వేల్యుయేషన్ల ప్రభావంతో పెట్టుబడుల ప్రవాహం మందగించడంతో స్టార్టప్‌లు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బిజ్2క్రెడిట్ వ్యవస్థాపకుడు రోహిత్ ఆరోరా తెలిపారు. 2023లో దేశీ స్టార్టప్‌లలోకి విదేశీ పెట్టుబడులు 72 శాతం పడిపోయాయని ఆయన వివరించారు.
అయితే, ఆర్థికంగా నిలదొక్కుకుని, ఈ పరిస్థితి నుంచి బైటపడటంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉందని ఆరోరా తెలిపారు. అంతర్జాతీయంగా గత కొంతకాలంగా ఎదురైన చేదు అనుభవాల కారణంగా వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు నమ్మకం కాస్త దెబ్బతిందని ప్రాప్‌టెక్ సంస్థ రెలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. దీంతో డీల్స్ విషయంలో వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం భారతీయ స్టార్టప్ వ్యవస్థలోకి ఈ ఏడాది పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంలో 5.9 బిలియన్ డాలర్లు రాగా ఈసారి 298 డీల్స్ ద్వారా రూ. 3.8 బిలియన్ డాలర్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment