సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది. ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్‌పోను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్, టూరిజం, ఇన్‌ఫ్రా, మహిళా సాధికారత, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై ఎక్స్‌పోలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ ఎక్స్‌పోను సందర్శించవచ్చన్నారు.
‘ఏఐ’తో వ్యాపార అవకాశాలపై సదస్సు
సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవడం ద్వారా వ్యాపార అవకాశాలు పెంచుకోవడంపై ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. విజయవాడలోని హోటల్ వివంతలో నిర్వహించే ఈ సదస్సులో చిన్న, మధ్య తరగతి, ఔత్సాహిక వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు పాల్గొనవచ్చని విజయవాడ రీజియన్ అధ్యక్షుడు మలినేని రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848077227, andhrachambervijayawada@gmail.comను సంప్రదించా లని సూచించారు.
25 వరకు నేచురోపతి కోర్సుకు వెబ్ ఆప్షన్స్
సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, యోగిక్ సైన్స్ సీట్ల భర్తీకి అభ్యర్థులు ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. స్పెషల్ స్ట్రె వేకెన్సీలో 76 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ స్పెషల్ స్ట్రె వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ కింద కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 76 కన్వీనర్ కోటా సీట్లను శనివారం రాత్రి కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 మధ్యాహ్నం లోగా కళాశాలల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.
ఏఆర్ డెయిరీలో ఏపీ పోలీసుల విచారణ
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 11 మందితో కూడిన ఏపీ పోలీసుల బృందం శనివారం విచారణ చేపట్టినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వివాదంలో కల్తీ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆదినుంచి ఏఆర్ డెయిరీ తోసిపుచ్చుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆ పరిశ్రమలోకి వెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment