న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే.
కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్‌సీఎల్‌టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్‌వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి.
ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment