నా ఇటుక– నా అమరావతి పేరిట చందాల వసూలు
విరాళాలిచ్చిన వారికి ఆన్‌లైన్‌లో రశీదులిస్తామని ప్రకటనలు
ఏం చేశారన్నదానిపై లెక్కలు మాయం
రాజధాని నిర్మాణం పేరిట ఇదో స్కామ్ అంటున్న జనం
రాష్ట్ర విభజన తరువాత రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు అండ్ కో భారీ దోపిడీకి తెరలేపారు. ఉత్తుత్తి డిజైన్లు, భారీ గ్రాఫిక్స్‌లతో రాజధాని నమూనాను చూపించి, జనాన్ని బోల్తా కొట్టించారు. పేద రాష్ట్రం అంటూ ప్రకటనలు గుప్పించి, ‘నా ఇటుక– నా అమరావతి’ పేరుతో చందాల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. అందుకోసం కొత్త వెబ్‌సైట్ రూపొందించారు. ఆ వెబ్‌సైట్ ద్వారా తీసుకున్న చందాలకు, విరాళాలకు రశీదులు కూడా ఇవ్వలేదు. బాబు గారడీని గుడ్డిగా నమ్మిన జనం భారీగా చందాలు సమర్పించేశారు. విరాళమిచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయపు పన్ను రాయితీ ఉంటుందని నమ్మించి నట్టేట ముంచేశారు. తీరా ఆ నిధి ఏమైందో.. విరాళాల మొత్తం ఎక్కడుందో తెలియక జనాలు తల పట్టుకుంటున్నారు. జిమ్మిక్కుల బాబు మాటలు విని మోసపోయామని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
ఇప్పుడు ఆ నిధి ఏమైనట్లో
ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగువారినుంచి భారీగా విరాళాలను సేకరించారు. అయితే అప్పుడు చెల్లించిన విరాళాలు ఏమయ్యాయో, ఎక్కడికెళ్లాయో నాటి పాలకులకే తెలియాలంటున్నారు సాధారణ జనం. రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపెట్టి ప్రజలను మోసం చేసిందే కాకుండా జనం నుంచి ఈ– ఇటుకల పేరిట జరిగిన దోచుకున్న తీరును తలచుకొని ఇప్పటికీ శాపనార్థాలు పెడుతున్నారు.
రాష్ట్ర విభజన తరువాత అమరావతిలో అద్భుతంగా సింగపూర్‌ను తలదన్నేలా కొత్త రాజధానిని నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ డిజైన్లతో కంప్యూటర్ల ద్వారా రాజధాని ఇలా ఉంటుంది, అలా ఉంటుందంటూ ప్రింట్‌లను తీసి భారీగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తుత్తి డిజైన్లను చూసిన జనం గుడ్డిగా నమ్మారు. అయితే ఇదంతా బాబు అండ్ కో సాగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారమని అప్పట్లో తెలుసుకోలేకపోయారు. దీనికి తోడు రాజధాని నిర్మాణాలకు ప్రజలనుంచి ఎన్‌ఆర్‌ఐల దాకా ‘నా ఇటుక– నా అమరావతి’ పేరిట వెబ్‌సైట్‌ను తెరిచి కొత్త స్కామ్‌కు నాంది పలికారు. మన రాజధాని కదా అనే ప్రేమతో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎందరో చందాలకోసం నగదును ఆన్‌లైన్ ద్వారా లక్షలాది రూపాయలు విరాళంగా అందించారు. అయితే ఇటుకలు పోతేపోనీ ఆ డబ్బు ఏమైందన్న ప్రశ్న జనం నుంచి వినిపిస్తోంది.
రాజధానికి ఆర్థిక సాయం పేరిట దోపిడీ
అమరావతి రాజధాని నిర్మాణం పేరిట అప్పటి పాలకులు 2015 అక్టోబరు 15న ‘నా ఇటుక– నా అమరావతి’ పేరిట ఈ– ఇటుక (ఈ–బ్రిక్) కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నిధిలో ఎవరైనా ఆర్థిక సాయం చేయచ్చునంటూ ప్రచారం చేశారు. ఒక్కో ఇటుక (రూ.10) నుంచి కోటి వరకూ ఆర్థిక సాయం చేయవచ్చని, దీన్ని రాజధాని నిర్మాణ నిధిలో ఉంచుతామంటూ ప్రకటనలిచ్చుకున్నారు. ఇందుకోసం జరిగే లావాదేవీలపై www.amaravathi.gov.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో నగదును మీ సేవల ద్వారా, పోస్టాఫీసులు, మనీ ఆర్డర్, డీడీ, ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పంపాలని సూచించారు. నగదు పంపిన వారు అదే సైట్‌లో విరాళ రశీదులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపులుంటాయంటూ నమ్మబలికారు. చాలా మందికి ఇది వర్తించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు త్వరలోనే వచ్చేస్తాయంటూ నమ్మించారు. ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది లక్షలాది రూపాయలను రాజధాని నిర్మాణానికి చెల్లించారు.
ఆ విషయాన్ని అడిగేవారెవరు?
ఈ ఇటుక కోసం నాటి పాలకులు సేకరించిన ప్రజాధనం ఏమైందో అడిగేవాళ్లెవరు. ఆ నిధికి ఎంత మొత్తం వచ్చింది. దాన్ని ఎక్కడ ఉంచారో చెప్పాల్సిన బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ఆయన మాట నమ్మి నాడు డబ్బులు కట్టిన వారంతా ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడా వెబ్‌సైట్ ఓపెన్ కావడమే లేదంటున్నారు కొందరు. అసలు ఏం జరిగిందో అప్పటి పాలకులకే తెలియాలి.
– సోమచంద్రారెడ్డి, మేధావుల ఫోరం అధ్యక్షుడు
ఇటుకల డబ్బు ఏమైంది?
చంద్రబాబు చెప్పినట్టు అమరావతిలో భారీ భవనాలు లేవు. కనీసం టీకొట్లు, మంచి హోటల్ కూడా లేదు. అక్కడున్నవన్నీ తాత్కాలిక భవనాలే. రాజధానిలోకి వెళ్లేందుకు సరిగ్గా రోడ్డు కూడా లేదు. సింగపూర్‌ను మించిన రాజధాని అన్నారు. ఎలాగు వర్షానికి ఇటుకలు కరిగిపోయినా వసూలు చేసిన డబ్బు ఏమైందో చంద్రబాబు జనానికి చెప్పాలి.
– సుబ్రమణ్యం రెడ్డి, రైతు, కల్లాడు, పలమనేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment