వైఎస్సార్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీయిజం
మామూళ్లు ఇవ్వలేదనే కక్షతో 11 లారీలు ధ్వంసం
టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు
దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం
జమ్మలమడుగు/మైలవరం: ‘మాకు మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్‌పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూళ్లు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు.
ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్నిరోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
వ్యాపారాలు సాఫీగా జరగాలన్నా.. లారీలు రోడ్డెక్కాలన్నా మామూళ్లు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో.. కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన 11 లారీలను ధ్వంసం చేశారు.
మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల యజమానులు, పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. బాడుగల రూపంలో వస్తున్న ఆదాయం తమ ఖర్చులకే సరిపోవడంలేదని, డ్రైవర్లకు, క్లీనర్‌లకు జీతాలు, లారీలకయ్యే ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు ఇలా రౌడీయిజం చేస్తే తామంతా బతికేదెలా అని ట్రాన్స్‌పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ హనుమంతప్పకు లారెన్స్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
చేపల పెంపకానికీ మామూళ్లు.. లేదంటే దాడే
జమ్మలమడుగులో చేపల పెంచుకోవాలన్నా టీడీపీ నాయకులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే దాడి చేసి చంపడానికీ వెనుకాడట్లేదు. చేపల పెంపక కేంద్రం నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బారాయుడిని కూడా ఇటీవల టీడీపీ నాయకులు బెదిరించారు.
రూ.20 లక్షలు ఇవ్వకపోతే చేపల కేంద్రాన్ని మూసేస్తామంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో సుబ్బారాయుడు, అతని కుమారులపై దాడి చేశారు. చికిత్స కోసం వెళ్తుండగా.. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కూడా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల తీరుతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment