
సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు మొదటి నిందితునిగా ఉన్న కణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయస్వామీజీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. హనీట్రాప్ ద్వారా బసవలింగ స్వామీజీ యువతితో ఉన్న వీడియోలను సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద గల వీడియో విడుదలచేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ ఉదంతంతో బసవలింగస్వామీజీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృత్యుంజయ స్వామి సొంత మఠంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసు కస్టడీకి తరలింపు
బసవలింగస్వామీజీ ఆత్మహత్యకేసులో అరెస్టైన మృత్యుంజయస్వామీజీ, నీలాంబిక, మహదేవయ్య ను రామనగర పోలీసులు సోమవారం మాగడి ఏఎంఎప్‌సీ కోర్టులో హాజరుపరిచి మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని మనవిచేశారు. న్యాయమూర్తి ధనలక్ష్మీ నవంబరు 4వ తేదీ వరకు వారిని పోలీసు కస్టడీకి ఆదేశించారు. కేసు గురించి డీజీపీ ప్రవీణ్‌సూద్ మాట్లాడుతూ బసవలింగస్వామీజీ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇందులో రహస్యం ఏమీ లేదని అన్నారు.
మరింత మంది స్వాములకు యువతి వల?
మృత్యుంజయ స్వామి, యువతి నీలాంబిక ఇతరులు కలిసి మరింతమంది స్వామీజీలను ఇదే విధంగా హనీట్రాప్ చేసినట్లు తెలిసింది. నీలాంబిక దొడ్డబళ్లాపురలో పేరుపొందిన కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని. చిన్న వయసు నుంచి ఓ మఠానికి వెళ్తూ పలువురు స్వామీజీలను పరిచయం చేసుకుంది. నీలాంబిక మామ సిద్దగంగ మఠంలో పనిచేస్తున్నాడు. తనతో స్నేహంగా మెలిగిన మరింత మంది స్వామీజీల వీడియోలను ఆమె కణ్ణూరు మృత్యుంజయస్వామికి ఇచ్చి ఉండవచ్చునని అనుమానాలున్నాయి. తద్వారా ఈ బృందం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చుననే కోణంలోనూ విచారణ సాగుతోంది.