Latest Updates
► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తైంది.
► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు.
►బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగుటీమ్‌లు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, అనధికరికంగా నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్‌లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
►బోయిగూడ అగ్ని ప్రమాద స్థలానికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. బోయిగూడ ఘటనపై అధికారులతో విశ్లేషిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్‌ఎంసీ, పోలీస్, అగ్నిమాపకశాఖ విజిలెన్స్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్క్రాప్ గోడౌన్‌లు ఎన్ని ఉన్నాయో.. ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోడౌన్‌లు చాలా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు
కాగా బోయిగూడ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమతులు లేని టింబర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇక బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు: సీవీ ఆనంద్
సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్, స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్క్రాప్ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్‌లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గోడౌన్ విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు.
సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అలాగే గోడౌన్‌లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు.
పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని
బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు.
సాక్షి, హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామన సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రధాని నరేంద్రమోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment