వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవికూమార్
సాక్షి,కేసముద్రం(మహబూబాబాద్): వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామశివారు చెరువు కొమ్ముతండాలో ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తను చంపిదో మహిళ. ఈమేరకు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముతండాకు చెందిన బానోత్ వీరన్న 15 ఏళ్ల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి శివారు జగ్గుతండాకు చెందిన వినోదను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు.
భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి..
రెండున్నరేళ్ల నుంచి ఇదే తండాకు చెందిన అజ్మీర నరేశ్‌తో వినోద వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలో తండా పెద్ద మనుషుల మధ్య వీరన్న పంచాయితీ కూడా పెట్టాడు. అనంతరం వీరన్న, వినోద, నరేశ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వినోద పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి రావాలని వీరన్న పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయినా వినోద రాకుండా.. ఆళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ భర్తతో ఉండలేనని, అతడిని ఎలాగైనా చంపాలని వినోద తన ప్రియుడు నరేశ్‌పై ఒత్తిడి తెచ్చింది.
దీంతో వీరన్నను చంపేందుకు తన స్నేహితులైన కురవి మండలం కంచర్లడూడెం తండాకు చెందిన బానోత్ సుమన్, నారాయణపురం శివారు చెరువుకొమ్ముతండాకు చెందిన దారావత్ రాంబాబు, దేవాతో నరేశ్ చేయి కలిపాడు. వీరంతా కలిసి ఈనెల 21న అర్ధరాత్రి నిద్రిస్తున్న వీరన్న మెడ చుట్టూ తాడు బిగించి చంపేశారు. పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వీరన్నను నరేశ్, అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి వినోద హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దీంతో సోమవారం హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య వినోద పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు రమేశ్‌బాబు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment