జైపూర్: సమాజంలో మనం డాక్టర్లకు ఎంత విలువనిస్తామో అందరికీ తెలిసిందే. కొందరు వైద్యులు తమ వృత్తిని దైవంగా భావించి ఎంతో మందికి సాయం చేస్తారు. మరికొందరు నిర్లక్ష్యంగా ఉండి.. వైద్య వృత్తికి, వైద్యులకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నింటికి వైద్యులను బాధ్యులను చేయడం సరైంది కాదు. వారిపై భౌతిక దాడులు, పోలీసుల కేసులు పెట్టడం సమంజసం కాదు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ పేషెంట్ మృతి చెందడంతో ఆమె ఫ్యామిలీ మెంటర్స్ సదరు డాక‍్టర్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన వైద్యురాలు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల ప్రకారం.. డాక్టర్ అర్చనా శర‍్మ.. దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఓ గర్భణికి వైద్యం చేస్తుండగా.. దురదృష్టవశాత్తు ఆమె హేమరేజ్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఆమె తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు వైద్యురాలిపై, ఆమె భర్తపై పోలీసు స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్తతో కలిసి ఆసుపత్రిని నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
సూసైడ్ నోట్‌లో.. ‘‘తన భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. అమాయకపు డాక్టర్లను వేధించకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను అమాయకురాలిని అని తెలుసుకోండి’’ అంటూ ఆవేదక వ్యక్తపరిచింది.
ఈ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. అర్చన మృతికి పోలీసులే కారణమంటూ వైద్యులు నిరసనలకు దిగారు. దీంతో ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తారు. ఏదైనా తప్పు జరిగితే.. డాక్టర్లను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. డాక్టర్లపై ఇలా కేసులు, దాడులు జరిపితే.. వారు ఎలా ప్రశాంతంగా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తగిన చర్యలను కూడా తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం గెహ్లాట్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment