వీడియోలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నెల 17న పెనమలూరులో రేషన్‌షాపును పీడీఎస్ డీటీ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. స్టాకు తేడా ఉండటంతో రిపోర్టు రాస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో వచ్చి డీటీ విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజుపై దాడి చేశారు.
ఈ దాడి తర్వాత కనిపించకుండాపోయారు. పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బోడె అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత బోడె ప్రసాద్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ తల దాచుకున్నారని, ఆ తర్వాత 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.
ఆ రేషన్ డీలర్ టీడీపీ కార్యకర్తే..
సోషల్ మీడియాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం వీడియో విడుదల చేశారు. రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు టీడీపీ కార్యకర్త అని మరోసారి బహిరంగపరిచారు. రేషన్ షాపు తనిఖీ చేయడం నేరమని, డీటీని ప్రశ్నించేందుకు వెళితే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు.
తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేదిలేదని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుచరులను జైలు పాల్జేసి తాను మాత్రం కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోవడంపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. రేషన్ షాపులో అక్రమాలు జరగకపోతే స్టాకులో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార ఏమైనట్టని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment