
నిందితులు పసుల జ్యోతి,బల్ల జ్యోతి , వెన్నెల
ఉప్పల్(హైదరాబాద్): బతికున్న వారిని చనిపోయినట్లు డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. రెండు కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డి, బాదితులు శుక్రవారం తెలిపిన మేరకు.. కొత్తపేట రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన పచ్చిపులుసు వరలక్ష్మి(71) రామంతాపూర్‌లో 1983లో 267 గజాల స్థలం కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా 2021 డిసెంబర్‌లో ఈశానమ్మ తదితరులు స్థలం తమదంటూ వరలక్ష్మిని బలవంతంగా బయటకు పంపారు.
వరలక్ష్మికి ఏకైక కూతురు తనే అంటూ జ్యోతి అనే మహిళ నకిలీ సర్టిఫికెట్లతో వచ్చి.. వరలక్ష్మి 2014 ఆగస్టు నెలలోనే మృతి చెందిందంటూ తన కూతురు పాసల వెన్నెల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ తరువాత పాసల వెన్నెల(19) గొల్లపూడి మరియమ్మకు రిజిస్ట్రేషన్ చేసింది. ఆ తరువాత స్థలం జ్యోతికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం పసుల జ్యోతి(33), జ్యోతి కూతురు వెన్నెల(19), చిలుకానగర్ ప్రాంతానికి చెందిన బల్ల జ్యోతి(27)లను నింధితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. వీరికి సహాకరించిన ఎనశమ్మ, శ్రవణ్, మల్లికార్జున్, రాయన్నలపై కూడ పోలీసులు కేసు నమోదు చేసారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment