ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించిన ఢిల్లీ అవెన్యూ కోర్టు
ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు
అంతకుముందు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు
సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా అరెస్టు చట్టవిరుద్ధమన్న కవిత లాయర్లు
నిబంధనల మేరకే అదుపులోకి తీసుకున్నామన్న ఈడీ
కుంభకోణంలో ఆమె పాత్రపై ఆధారాలు ఉన్నాయని వివరణ
కవిత భర్త అనిల్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు!
సోమవారం ఢిల్లీలో విచారణకు రావాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది. ఈడీ కవితను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.
శనివారం ఉదయం ఇద్దరు వైద్యులను ఈడీ కార్యాలయానికి పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఉదయం 11.30 సమయంలో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు. మద్యం స్కాం కేసుకు సంబంధించి కవిత నుంచి కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని, ఆమెను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
అరెస్టు అక్రమం: కవిత తరఫు న్యాయవాది
కవిత అరెస్టు అక్రమమని ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు చెప్పారు. శుక్రవారం కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. ఆమెను కలిసేందుకు తమకు అనుమతివ్వలేదని, విచారణకు ముందు ఆమెతో మాట్లాడేందుకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు.
ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నాగ్‌పాల్.. కవితతో మాట్లాడేందుకు అనుమతించారు. కాసేపటి తర్వాత విచారణ తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తదుపరి విచారణ వరకూ కవితపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ హామీ ఇచ్చిందని న్యాయవాది విక్రమ్ చౌదరి గుర్తు చేశారు.
కానీ ఆ హామీని ఉల్లంఘించి కవితను అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పారు. ఇలా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో కవితను అరెస్టు చేయడాన్ని బ్లాక్‌డేగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు మహిళలను విచారించే అంశంలో నళిని చిదంబరం వేసిన పిటిషన్‌కు కవిత పిటిషన్‌ను జతచేసి, విచారణకు చేపట్టిందని న్యాయమూర్తికి వివరించారు.
నిబంధనల మేరకే అరెస్టు చేశాం: ఈడీ
కవితను నిబంధనల మేరకే అరెస్టు చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోసెబ్ హుస్సేన్ కోర్టుకు విన్నవించారు. పత్రికల్లో వచ్చిన విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దని న్యాయమూర్తిని కోరారు. తర్వాతి 10 రోజుల్లో సమన్లు ఇవ్వబోమని మాత్రమే సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిందని.. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేదని వివరించారు.
ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే దానిని నిరవధిక కాలానికి వర్తింపజేసుకోవద్దని, ఇతరులకు ఇచ్చిన ఉత్తర్వులను, మధ్యంతర ఉత్తర్వులను మొత్తానికి వర్తించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. కవితపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని జోసెబ్ వివరించారు.
లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయని, ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టేందుకు పది రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి.. సాయంత్రం 4.30 గంటలకు తీర్పు వెలువరించారు. కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించారు.
నా అరెస్టు అక్రమం: కవిత
ఈడీ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కోర్టుకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు. కాగా కవిత భర్త అనిల్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, కవిత పీఏలు రాజేశ్, అశోక్ కౌశిక్ తదితరులు రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. కోర్టులో జరిగిన వాదనలు విన్నారు.
కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు!
కవిత భర్త అనిల్‌కు, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వారిని సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురి ఫోన్లను సీజ్ చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment