నిందితుడు, దొంగతనం కోసం రాసిచ్చిన చీటీ
2021, మార్చి 18
ఇంగ్లాండ్, హ్యాస్టింగ్స్‌లోని సేయింట్ లియోనార్డ్స్‌కు చెందిన 67 ఏళ్ల అలన్ స్టాటరీ ఈస్ట్‌బోర్న్‌లోని ఓ బ్యాంకులోకి ప్రవేశించాడు. నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతడి చేతిలో ఓ చీటీ పెట్టాడు. రెండు ప్యాంట్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఆ చీటీని చదవటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు క్యాషియర్. అందులో ఏముందో అర్థంకాక దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు. ఆ క్యాషియర్ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు స్లాటరీ. కొద్దిసేపటి తర్వాత ఆ చీటి బిల్డింగ్ సిబ్బంది ఒకరి దగ్గరకు చేరింది. దాన్ని చదివిన ఆ సిబ్బంది ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా స్లాటరీ కోసం అన్వేషణ ప్రారంభించారు.
2021, మార్చి 26
స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచీకి వెళ్లాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మునుపటి లాగే ఓ చీటీ అతడి చేతిలో పెట్టాడు. అది చదివిన క్యాషియర్ భయపడిపోయాడు. వెంటనే 2,400 స్టెర్లింగ్ పౌండ్‌లు(దాదాపు రెండున్నర లక్షలు) అతడి చేతిలో పెట్టాడు. ముసలాయన డబ్బుతో బ్యాంకు బయటకు వచ్చాడు. కొన్ని గంటల తర్వాత నాట్‌వెస్ట్‌లోని మరో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కూడా ఓ చీటీని క్యాషియర్ చేతిలో పెట్టాడు. చీటీని చదివిన సదరు క్యాషియర్ స్లాటరీపై సీరియస్ అవ్వటంతో చేసేదేమీ లేక అక్కడినుంచి బయటకు వచ్చేశాడు.
ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన స్లాటరీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. స్టాటరీని అతడి ఇంటివద్ద అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఇంతకీ ఆ చీటిలో ఏముందంటే.. ‘‘ నా దగ్గర ఉన్న దాన్ని(పిస్టల్‌ను ఉద్దేశిస్తూ) మీ సీసీ కెమెరాలు బంధించక మానవు. మిగిలిన కస్టమర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించు. మర్యాదగా నేనడిగిన డబ్బు(10s.. 20s) ఇవ్వు’’ అని రాసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment