అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను.. | Man Life Ended After Mother Deceased In kurnool District | Sakshi
Sakshi News home page

అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..

Published Thu, Aug 26 2021 8:04 PM | Last Updated on Thu, Aug 26 2021 8:10 PM

Man Life Ended After Mother Deceased In kurnool District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,కర్నూలు: ‘అమ్మా.. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. అయినా కష్టం విలువ తెలియకుండా పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు నువ్వూ వదిలిపోతే నేనెలా బతికేది. నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను’ అంటూ ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అవుకు మండల పరిధిలోని నిచ్చెన మెట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండి వెంకటరాముడు (31) ఆరేళ్ల వయస్సులో ఉండగా తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.

తల్లి లక్ష్మీదేవి అన్నీ తానై రెక్కల కష్టంతో కుమారుడిని పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసింది. వెంకటరాముడికి కూతుళ్లు ఆరేళ్ల సిరివెన్నెల, నాలుగేళ్ల శ్రీజ, రెండేళ్ల వర్షిత ఉన్నారు. ప్రస్తుతం భార్య జ్యోతి గర్భిణి. ఈక్రమంలో రెండు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నప్పుడే తండ్రి మృచెందినా ఏ లోటూ రానివ్వకుండా చూసుకున్న తల్లి దూరం కావడంతో దిగులు చెందేవాడు.

ఈక్రమంలో ఈ నెల 23న రాత్రి కలుపు మొక్కల నివారణ మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక 24న మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. మృతుని కూతుళ్లు, భార్య రోదించిన తీరును చూసి గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు.

చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement