ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీఆర్‌ఎస్‌ నేత హత్య | Maoists Assassinated TRS Leader In Warangal | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీఆర్‌ఎస్‌ నేత హత్య

Published Mon, Oct 12 2020 1:56 AM | Last Updated on Mon, Oct 12 2020 9:24 AM

Maoists Assassinated TRS Leader In Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగారు. అటవీ ప్రాంతంలో ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండలం బోధాపూర్‌ (అలుబాక)కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు మాడూరి భీమేశ్వర్‌రావు (బీసు) (48)ను పోలీసు ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు హతమార్చారు. శనివారం అర్ధరాత్రి భీమేశ్వర్‌రావు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మావోలు లోనికి చొరబడ్డారు. కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి ఆయనను దారుణంగా హత్య చేశారు. హతుడి భార్య మాడూరి కుమారి తన భర్తను ఏమీ చేయవద్దని ఎంత బ్రతిమి లాడినా కనికరించలేదు. కాగా భీమేశ్వర్‌ పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందువల్లే హతమార్చినట్లు మావోలు ఘటనా స్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నారు.

మహదేవ పూర్‌ మండలం పంకెనలో కమ్మల రాఘవు లును (కాంగ్రెస్‌ పార్టీ) 2012 మే నెలలో మావోయిస్టులు ఇదే కారణంతో హత్య చేశారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిని హత్య చేయడం కలకలం రేపుతుండగా, పోలీసులు అధికార పార్టీ నేతలు, టార్గెట్లను అప్రమత్తం చేస్తున్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కిందటి నెలలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 8 మంది మావోలు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడవచ్చని పోలీ సులు అనుమానించారు. అదే నిజమైంది. అధి కార పార్టీ నాయకుడిని టార్గెట్‌ చేసి చంపేశారు.

రాత్రి అసలేం జరిగింది
మావోయిస్టులు భీమేశ్వర్‌రావును పథకం ప్రకా రమే హత్య చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భీమేశ్వర్‌ రావు ఇంటికి చేరుకున్న ఆరుగురు మావోలు ఆయనను బయటకు రావాల్సిందిగా కోరారు. అనుమానం వచ్చిన భీమేశ్వర్‌ తలుపులు తీయకపోవడంతో... ‘అత్యవసరంగా డబ్బు కావాలి. ఆస్పత్రికి వెళ్లాలి’అంటూ ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బు లేదన్న భీమేశ్వర్‌ ఇంటి తలుపులు తీయలేదు. దీంతో మావోయిస్టులు తలుపులపై కాల్పులు జరిపి, బద్దలుకొట్టి భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. ఇదే సమయంలో భర్త దగ్గరకు వచ్చిన భార్య కుమారి కూడా తమ వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, రేపు ఇస్తామని పేర్కొంది. తుపాకులు ధరించిన ఇద్దరు ఆమెను పక్కకు లాక్కెళ్లి ‘కదిలితే చంపేస్తాం’అని బెదిరించారు. మరో ముగ్గురు భీమేశ్వర్‌ను ఇంట్లోనే మరోచోటికి తీసుకెళ్లారు. భీమేశ్వర్‌రావును కర్రలతో చితకబాది, కత్తులతో దాడి చేశారు.

‘నన్ను చంపొద్దు.. మీరు ఏం చెబితే అది చేస్తా’అని ఆయన వేడుకున్నా ఆగకుండా దారుణంగా పొడిచారు. ఇంటి వెలుపల సెంట్రీగా ఉన్న మరోవ్యక్తి ‘ఏదో వాహనం వస్తోంది. లైట్లు కనిపిస్తున్నాయ’ని అరవడంతో ఇంట్లో నుంచి మావోయిస్టులు బయటకు పారిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరో 20 మంది బయట కాపలా ఉన్నట్లు తెలిసింది. భీమేశ్వర్‌ కుటుంబసభ్యుల అరుపులు, ఆర్తనాదాలతో బయటకు వచ్చిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా... అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు భీమేశ్వర్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వెంకటాపూర్‌ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటన స్థలంలో రెండు బుల్లెట్లు, కత్తులు, మావోయిస్టుల వదిలిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్, ఏఎస్పీ శరత్‌చంద్ర పవార్, వెంకటాపురం సీఐ శివప్రసాద్‌ సంఘటనపై ఆరా తీస్తున్నారు. 

ఎంత బతిమాలినా వినలేదు 
– మాడూరి కుమారి, మృతుడి భార్య

బలవంతంగా ఇంట్లోకి వచ్చిన మావోయిస్టులు నేను, మా ఆయన ఎంత బ్రతిమిలాడినా వినలేదు. మా ఆయనను ఏమీ అనవద్దని నేను అడ్డంగా నిలుచుంటే తుపాకులు పట్టుకున్న ఇద్దరు పక్కకు తీసుకెళ్లి కదిలితే చంపుతామన్నారు. ఇంకో ముగ్గురు మా ఆయనను ఇంట్లోనే పక్కకు తీసుకెళ్లి దారుణంగా పొడిచారు. కుటుంబం రోడ్డునపడుతుంది, అనాథలమవుతామని వేడుకున్నా కనికరించలేదు. ఆరుగురు వచ్చారు... అందరూ సాదా దుస్తులు, షార్టులు, టీ షర్ట్‌లు వేసుకున్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు ఇదేగతి
– లేఖలో మావోయిస్టులు

టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందుకే భీమేశ్వర్‌ను హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరిట వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు. అధికార పార్టీలో ఉంటూ... ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకే హత్య
– సంగ్రామ్‌సింగ్‌ పాటిల్, ఎస్పీ, ములుగు

భీమేశ్వరరావును మావోయిస్టులు పలుమార్లు పార్టీ ఫండ్‌ అడగ్గా... ఆయన తిరస్కరించారు. దీనితో ఆయనపై మావోలు కక్ష పెంచుకున్నారు. సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు శనివారం అర్ధరాత్రి భీమేశ్వరరావుపై దాడి చేసి... అతిదారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ, రోడ్లను తవ్వి ప్రజాజీవనానికి ఆటంకాలు కల్పిస్తున్నారు. పార్టీ ఫండ్‌ ఇవ్వని సామాన్య ప్రజలను పోలీస్‌ ఇన్‌ఫార్మర్లనే నెపంతో మావోలు హత్య చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement