సాక్షి, బొమ్మలసత్రం: వారం రోజుల క్రితం నంద్యాల పట్టణంలో జరిగిన రౌడీషీటర్ మారెడ్డి రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగించడంతో పాటు మానసికంగా వేధిస్తున్నాడని స్నేహితుడే దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి విలేకరులకు వివరించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన మారెడ్డి రాజశేఖర్ ఇదే మండలం అల్లినగరం గ్రామానికి చెందిన సంజీవ కుమార్ స్నేహితులు, సమీప బంధువులు కూడా. వీరిద్దరు మరికొంత మందితో కలిసి 2013లో కర్నూలులో మైనింగ్ వ్యాపారి దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ సమయంలో కొంత బంగారు నగలు దొంగలించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా అపహరించిన బంగారు ఆభరణాల పంపకంలో ఇద్దరి మధ్య కొంత కాలం క్రితం వివాదం మొదలైంది.
అప్పటి నుంచి రాజశేఖర్, సంజీవకుమార్ మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో 2019లో త్రీటౌన్ పరిధిలోని రైల్వేస్టేషన్ సమీపంలో సంజీవ కుమార్ రోడ్డుపై వెళ్తుండగా రాజశేఖర్ కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా సంజీవ కుమార్‌కు అప్పు ఇచ్చిన వారితో చెక్‌బౌన్స్ కేసులు వేయించాడు. తనను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్న రాజశేఖర్‌ను అంతమొందించాలని సంజీవకుమార్ కుట్ర పన్నాడు. నంద్యాల పట్టణానికి చెందిన తన స్నేహితులు షేక్ మాలిక్‌బాషా, సుగర శెట్టి మదనగోపాల్, ఎడవల్లి కల్యాణ్, పల్లప శివరాజు, సుంకిశెట్టి రమేష్‌తో కలిసి హత్యకు పథకం వేశారు.
ఈనెల 24వ తేదీ ఎన్జీఓస్ కాలనీలోని రామాలయం సమీపంలో ఉన్న రాజశేఖర్‌పై కత్తులు, ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సాయివాణి హాస్పిటల్ వద్ద ఆటోలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా రాజశేఖర్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. హత్యకు సంబంధం ఉన్న మరో యువకుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ కంబగిరిరాముడు, ఎస్‌ఐలు నజీర్ హుస్సేన్, పీరయ్యను డీఎస్పీ అభినందించారు.
చదవండి: నేనేమీ చేశాను పాపం?!
Comments
Please login to add a commentAdd a comment