తిరుత్తణి/నగరి (చిత్తూరు జిల్లా): ఏపీ మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడు ప్రతీష్‌పై ఈ నెల 2వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో ప్రతీష్ పై హత్యాయత్నం తెలుగుదేశం కుట్రేనని స్పష్టమైంది. తెలుగుయువత నాయకులైన నిందితులు టీడీపీ నగరి ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్ అనుచరులే. వీరిని ఆదివారం నగరి, తిరుత్తణి సరిహద్దులోని తాళవేడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో హత్యాయత్నం చేసింది తామేనని చెప్పడంతో నగరి మండలం మేళపట్టుకు తెలుగుయువత మండల ఉపాధ్యక్షుడు నవీన్ అలియాస్ వెట్టు నవీన్, నాయకులు నగరి మున్సిపాలిటీ కీళపట్టు బీసీ కాలనీకి చెందిన చిరంజీవి, నిండ్ర మండలం వైఎన్ కండ్రిగకు చెందిన పరశురాం అలియాస్ మధులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
హత్యకు తెలుగు యువత మండల అధ్యక్షుడి కుట్ర
ప్రతీష్‌ను హత్యచేసేందుకు తెలుగుయువత మండల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుత్తణి సీఐ మార్టిన్ ప్రేమ్‌రాజ్ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భానుప్రకాష్ పై ఆర్కే రోజా గెలవడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం వర్గీయులు ఆమెపై కక్షపెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. రోజా తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె కార్యాలయ మేనేజర్ ప్రతీష్ను హత్యచేయాలని తెలుగుయువత నగరి మండల అధ్యక్షుడు చిట్టిబాబు కుట్రపన్నారు.
అతడితో నవీన్, చిరంజీవి, పరశురాం చేతులు కలిపారు. నగరిలో హత్యచేస్తే రాజకీయరంగు పులుముకుంటుందని, అందువల్ల ప్రతీష్ను అతను ఉండే తిరుత్తణిలోనే హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తిరుత్తణిలో బసచేశారు. ప్రతీష్ వాకింగ్ చేసే ప్రదేశాన్ని రాత్రి ఒంటిగంట సమయంలో పరిశీలించి వచ్చిన చిట్టిబాబు హత్యచేయడానికి అనువుగా ఉందని మిగిలినవారికి చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా వస్తే సమాచారం అందించడానికి నిండ్రకు చెందిన ముగ్గురు కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన ప్రతీష్పై ఇనుపరాడ్లతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తలపై కొట్టే సమయానికి ప్రతీష్ చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి బలమైన గాయమైంది. ఇంతలో సమీపంలో ఉన్న జనం కేకలు వేయడంతో ఇప్పుడు మిస్ అయింది.. మరోసారి వేసేస్తాం.. అని అరుస్తూ ముళ్లకంపల మధ్య దాచి ఉంచిన బైక్ మీద పరారయ్యారు.
పార్టీ నాయకులకు సన్నిహితం
హత్యాయత్నం కేసులో నిందితులు పార్టీ నాయకుడు గాలి భానుప్రకాష్తో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు లోకేశ్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సెల్ఫీ తీసుకునే చనువు కూడా వారికి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment