సాక్షి, అమరావతి: మార్గదర్శి తరహాలో పశ్చిమ బెంగాల్‌లో చిట్‌ఫండ్ కుంభకోణానికి పాల్పడిన ‘యూఆర్‌వో చిట్‌ఫండ్స్’పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. రామోజీరావు మాదిరిగానే చందాదారుల నిధులను మళ్లించిన యూఆర్‌వో చిట్‌ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చందాదారుల డబ్బులను తమకు చెందిన వివిధ వ్యాపార సంస్థలకు మళ్లించిన కేసులో ఆయన్ను అరెస్టు చేసి ఆయన్ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. బిశ్వప్రియ గిరికి న్యాయస్థానం సెప్టెంబరు 1 వరకు రిమాండ్ విధించింది. యూఆర్‌వో చిట్‌ఫండ్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు ఒకే తరహాలో ఉన్నాయి. నిజానికి యూఆర్‌వో చిట్‌ఫండ్స్ కంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు అనేక రెట్లు పెద్దవి కావడం గమనార్హం.
రూ.200 కోట్లు మళ్లించిన యూఆర్‌వో చిట్‌ఫండ్స్
యూఆర్‌వో చిట్‌ఫండ్స్ ప్రమోటర్, డైరెక్టర్ బిశ్వప్రియ గిరి ఈ కుంభకోణానికి సూత్రధారి. చిట్‌ఫండ్స్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేశారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చందాదారుల సొమ్మును తమ సొంత వ్యాపార సంస్థల్లోకి మళ్లించారు. చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడ్డారు. రూ.200 కోట్లను ఇతర సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా మళ్లించారు.
బిశ్వప్రియ గిరి కుటుంబానికే చెందిన అగ్రో ఇండస్ట్రీ, లైఫ్‌కేర్, ఆటోమోటివ్, హోటళ్లు–రిసార్టులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. చందాదారుల సొమ్మును తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఈ క్రమంలో చందాదారులకు సక్రమంగా చెల్లించలేక మోసానికి పాల్పడ్డారు. ఈడీ అధికారులు తనిఖీలు జరిపి పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.
అంతకు మించి మార్గదర్శి మోసాలు
యూఆర్‌వో చిట్‌ఫండ్స్ వసూలు చేసినట్లుగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా తమ చందాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పి రశీదు రూపంలో అక్రమ డిపాజిట్లు సేకరించింది. బిశ్వప్రియ గిరి తరహాలోనే రామోజీరావు కూడా చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించారు. తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో చిట్‌ఫండ్ చందాదారుల డబ్బును పెట్టుబడులుగా పెట్టారు.
అంతేకాకుండా వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా వాటిని మళ్లించారు. యూఆర్‌వో గ్రూప్‌నకు చెందిన బిశ్వప్రియ గిరి కేవలం కేవలం రూ.200 కోట్లు మాత్రమే మళ్లించగా రామోజీరావు అంతకు ఎన్నో రెట్లు అధికంగా రూ.వేల కోట్లను అక్రమంగా దారి మళ్లించడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన అక్రమ పెట్టుబడులే రూ.1,035 కోట్లుగా ఉన్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గుర్తించారు.
ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్‌లో 44.55 శాతం పెట్టుబడులుగా పెట్టారు. వాటి మార్కెట్ విలువ భారీగా ఉంటుదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి యూఆర్‌వో చిట్‌ఫండ్స్ మోసాల కంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించిన కేసులో యూఆర్‌వో చిట్‌ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరి అరెస్టు అయ్యారు. మరి అంతకంటే భారీగా చందాదారుల నిధులను మళ్లించిన రామోజీరావుపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల గురించి సీఐడీ విభాగం ఇప్పటికే ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆధారాలతో సహా నివేదికను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment