తన పరిశ్రమను నాశనం చేసి, దౌర్జన్యం చేస్తున్నారని ఓ మహిళ ఆవేదన
సీఎం చంద్రబాబు దగ్గరకు.. వస్తే అడ్డుకున్న పోలీసులు
విరక్తితో గాజులు పగులగొట్టుకుని మింగేందుకు యత్నం
విలేకరుల ఫోన్లు లాక్కుని ఫొటోలు డిలీట్ చేసిన పోలీసులు
చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో ఘటన
తిరుపతి రూరల్: అయ్యా.. నా పరిశ్రమను నాశనం చేశారని, నాపై దౌర్జన్యం చేసి జాకెట్‌ను సైతం చించేశారు, పోలీసులు కూడా నాపై దాడిచేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు, ముఖ్యమంత్రిగారికి నా బాధ చెప్పుకుంటానయ్యా.. అంటూ వచ్చింది ఓ మహిళ. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన మీద వచ్చారని, ఎవరినీ కలవరంటూ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో జరిగిందీ ఘటన.
.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు, సరోజినిదేవి దంపతుల నుంచి కొంతభూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు రూ.కోటి ఖర్చుతో ఎల్‌వీ పవర్‌లూమ్స్, హ్యాండ్‌లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హాథీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యాజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
కోర్టు స్టే ఉన్నా రాజేశ్వరరావు, మరికొందరు కలిసి హ్యాండ్‌లూమ్స్‌ను ఖాళీచేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. రూ.50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్నా సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడిచేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచి్చన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం యశోద.. నారావారిపల్లికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఏడుస్తూ.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగులుగొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆపి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
మీడియాపైనా దౌర్జన్యం..
ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లు, కెమెరాలను లాక్కుని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment