జాతీయ క్రికెట్ పోటీలకు మండపేట విద్యార్థి
మండపేట: పట్టణలలోని ఎస్‌వీఎస్సార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 9వ తరగతి విద్యార్థి కంకిపాటి చందుసాయి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. అందులో అండర్ 14 విభాగంలో మండపేట విద్యార్థి చందుసాయి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి అత్యధిక వికెట్లను తీశాడు. చందుసాయి నైపుణ్యాన్ని గుర్తించి త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక చేశారు. ఆ పోటీల్లో రాష్ట్ర జట్టులో సాయికి స్థానం దక్కింది.
ఈ సందర్భంగా ఎస్‌వీఎస్సార్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగకుమార్, ఇన్‌చార్జి జీవీ గణేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు సీహెచ్‌ఎల్ శ్రీనివాసరావు విద్యార్థిని అభినందించి జ్ఞాపికను అందించారు. కాగా పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆదనపు తరగతులు నిర్వహిస్తున్నందున జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా మంగళవారం పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలను సందర్శించి బోధనా తరగతులను పరిశీలించారు. అనంతరం జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై న విద్యార్థి చందుసాయిని పాఠశాలకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించి బహుమతిని అందజేశారు. ఆయన వెంట ఎంఈవోనాయుడు రామచంద్రరావు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గెడా శ్రీనివాసరావు ఉన్నారు.
లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరరెడ్డి
రాయవరం: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా డీవీవీ నాగేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నాగేశ్వరరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లా కార్యవర్గం వివరాలను ఆయన వివరించారు. ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం.అంబేడ్కర్, ట్రెజరర్‌గా పి.రమేష్, మహిళా కార్యదర్శిగా ఎస్.వి.నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా కె.గణేశ్వరరావు, స్టేట్ కౌన్సిలర్‌గా ఎస్‌వీ ప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పింఛన్ల పంపిణీ
అమలాపురం రూరల్: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా జనవరి 2025 నెలకు ఒక రోజు ముందే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 2,38,012 లబ్ధిదారుల్లో 2,25,242 మందికి (94.63 శాతం) పింఛన్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్ మహేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 4డ355 మంది సెక్రటేరియట్ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దనే పంపిణీ చేశామన్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతూ మరణించిన వ్యక్తుల భార్యలకు నవంబర్ 1 వ తేదీ నుంచి పింఛన్ ఇస్తున్నట్టు చెప్పారు.
7 వరకు ఎస్సీ కులగణన గడువు పెంపు
అమలాపురం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎస్సీ కులగణన వివరాలను 26 తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం.జ్యోతి లక్ష్మిదేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. జనవరి 11వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 17న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు.
మూడు దశలలో తనిఖీ జరుగుతుందని పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వయసు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి వ్యవసాయం ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతారాలను వీఆర్వోలు స్వీకరిస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను ఆర్‌ఐకు నివేదిస్తారు. తహసీల్దార్ వీఆర్వో, ఆర్‌ఐల నివేదికల్లోని వివరాలను పరిశీలించి ఆమోదం తెలిపాక పోర్టల్‌లో నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment