సృజనాత్మకత వెలికితీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు
అమలాపురం రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకే ఈ నెల 4న పి.గన్నవరంలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం అమలాపురంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. సుస్థిరమైన భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతిక, స్వయం ఉపాధి తదితర అంశాలపై ప్రాజెక్టులను విద్యార్థులు చేయాలన్నారు. సమాజంలో మార్పులకు అనుగుణంగా ఆలోచనలు ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ప్రాజెక్టుల తయారీలో ప్రతిభ చాటాలన్నారు. టీచర్, విద్యార్థుల వ్యక్తిగత, విద్యార్థుల గ్రూప్ విభాగాల్లో ప్రాజెక్టులను ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment