నేటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
వనుము సోమశేఖరరావు, డీఐఈవో
అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పేరుతో విద్యార్థులకు శనివారం నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ మేరకు డీఐఈవో అమలాపురంలో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు చేసేందుకు అవసరమైన కంచాలు, గిన్నెలు, గ్లాసులతోపాటు వండిన పదార్థాలు ఉంచేందుకు హాట్ ప్యాక్‌లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇప్పటికే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ప్రతి కళాశాలకు సమీపంలో గల ఒక ఉన్నత పాఠశాలను భోజనాల కోసం జత చేశామన్నారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి జనరల్, ఒకేషనల్ ఇంటర్మీడియెట్ విద్యను అభ్యసిస్తున్న వారు ఈ పథకానికి అర్హులన్నారు. ప్రథమ సంవత్సరంలో 1,382 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,132 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.
హైందవ శంఖారావం
బ్రోచర్ల విడుదల
అమలాపురం టౌన్: విజయవాడలో ఆదివారం జరగనున్న హైందవ శంఖారావం మహాసభకు జిల్లా నుంచి హిందువు అయిన ప్రతి ఒక్కరూ తరలి వెళ్లి విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. శంఖారావం మహాసభకు తరలి వెళ్లడం ద్వారా హిందువుల ఐక్యతను చాటుదామని అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, ధర్మ ప్రచారక్, ధర్మ రక్షక్ తదితర ధార్మిక సంస్థల ప్రతినిధులతో సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ సందర్భంగా హైందవ శంఖారావం కరపత్రాలు, బ్రోచర్లను వారు విడుదల చేశారు. దేశమంతటా హిందూ దేవాలయాకు స్వయం ప్రతిపత్తిని కోరుతూ వీహెచ్‌పీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టందని రాష్ట్ర సత్సంగ ప్రముఖ్ రాళ్లపల్లి పాపయ్యశర్మ స్పష్టం చేశారు. బజరంగ్ దళ్ రాష్ట్ర సహాయ ప్రముఖ్ శిరంగు నాయుడు, ధర్మ ప్రచారక్ జిల్లా ప్రముఖ్ పెండ్యాల సీతారామ్, విశేష సంపర్క ప్రముఖ్ భమిడిపాటి కృష్ణమూర్తి, ధర్మ రక్షక్ కుడుపూడి గోపాల కృష్ణ తదితర ధార్మిక సంస్థల ప్రతినిధులు మాట్లాడారు.
ఫిషింగ్ బోట్లలో తనిఖీలు
ఏడు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రంలో విడుదల
తాళ్లరేవు: కాకినాడ జిల్లా పరిధిలోని ఎన్టీఆర్, ఉప్పాడ బీచ్‌లలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఫారెస్ట్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఫారెస్ట్ రేంజర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో కోరంగి పంచాయతీ హోప్ ఐలాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీలలో భాగంగా రెండు ఫిషింగ్ బోట్లలో తనిఖీ చేయగా ఒక బోటులో నాలుగు, మరో బోటులో మూడు తాబేళ్లు జీవించి ఉన్నట్లు గుర్తించామన్నారు. వలలను కత్తిరించి తాబేళ్లను సముద్రంలో వదిలివేసి బోట్లను స్వాధీన పరచుకున్నట్లు ప్రసాదరావు తెలిపారు. ఇకపై హోప్‌ఐలాండ్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం దాటి ఫిషింగ్ చేసుకోవాలని లేకుంటే వారిపై వైల్డ్‌లైఫ్, ఫిషరీస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
నేటి నుంచి పక్షుల గణన
తాళ్లరేవు: అంతర్జాతీయ నీటి పక్షులను గుర్తించేందుకు శని, ఆదివారాలలో నీటి పక్షుల గణన నిర్వహించనున్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ పక్షుల గణనకు సంబంధించి బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్) బర్డ్స్ వాటర్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెక్కన్ బర్డ్స్ హైదరాబాద్ తదితర సంస్థలతోపాటు కళాశాల విద్యార్థులు మొత్తం 60 మందికి పైగా పాల్గొంటారని తెలిపారు. దీనిలో భాగంగా 4వ తేదీన లెక్కింపు ఎలా చేయాలి అన్నఅంశంపై కోరంగి బయోడైవర్సిటీ సెంటర్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అభయారణ్యం పరిధిలోని 12 పక్షి ఆవాస ప్రాంతాల్లో బృందానికి ఐదుగురు చొప్పున నీటిపక్షుల గణన చేపడతారని ప్రసాదరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment