సృజన విరిసే వేళలో..
ప్రదర్శనను ప్రారంభించనున్న కలెక్టర్
పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఉదయం 9గంటలకు కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్‌కుమార్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి ప్రదర్శనకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందుకు 17 కమిటీలను ఏర్పాటు చేశారు.
పి.గన్నవరం: ఎందుకు..ఏమిటి..ఎలా అనే ప్రశ్నలు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. తరగతి గదుల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలకు సృజనాత్మకతను జోడించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థి దశ నుంచే ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌స్ఫైర్ మనాక్, బాలల సైన్స్ కాంగ్రెస్, జాతీయ సైన్స్ దినోత్సవం తదితర ప్రతిభా పోటీలు నిర్వహిస్తుంటాయి. ఏటా జిల్లా స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని 22 మండలాల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగాయి. మండల స్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపిక చేసిన ఐదు ప్రాజెక్టులు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రానున్నాయి. సైన్స్‌ఫేర్‌కు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి మండలం నుంచి ఐదు కేటగిరీల్లో..
విద్యార్థులకు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థి విభాగంలో వ్యక్తిగత, గ్రూపు యాక్టవిటీస్ నుంచి రెండేసి వంతున ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఉపాధ్యాయ విభాగం నుంచి ఒక ప్రాజెక్టు జిల్లాకు ఎంపిక చేశారు. ఈ విధంగా ప్రతి మండలం నుంచి ఐదు ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. 22 మండలాల నుంచి 110 ప్రాజెక్టులను జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు చేరుకోనున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయాలజీ, ఖగోళశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలో పాల్గొనాలనుకొనే ఉపాధ్యాయుడు ఒకరు మాత్రమే ఏడు విభాగాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. వ్యక్తిగత విభాగంలో పోటీ పడే విద్యార్థులు ఏడు అంశాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని గైడ్ టీచర్‌తో కలిసి పోటీ పడవచ్చు.
21, 22, 23 తేదీల్లో రీజనల్ స్థాయి పోటీలు
జిల్లా స్థాయి ప్రాజెక్టులను ఈ నెల 21, 22, 23 తేదీల్లో పుదుచ్చేరిలో నిర్వహించనున్న రీజనల్ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. సాధారణ పాఠశాలలతో పాటు అటల్ ల్యాబ్ ఉన్న పాఠశాలలు కూడా జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చు. అయితే అటల్ ల్యాబ్‌లో తయారు చేసిన ప్రాజెక్టులే ప్రదర్శించాలి. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్టులు నేరుగా జిల్లా స్థాయికి నామినేట్ అవుతాయి. రాష్ట్ర స్థాయికి జిల్లా నుంచి విద్యార్థి వ్యక్తిగత, గ్రూపు విభాగాలతో పాటుగా, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండేసి వంతున మొత్తం ఆరు ప్రాజెక్టులు రీజనల్ స్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తిగత విభాగాల నుంచి 15, గ్రూపు విభాగాల నుంచి పది, ఉపాధ్యాయ విభాగం నుంచి పది మొత్తం 35 ప్రాజెక్టులను రీజనల్ స్థాయికి పంపిస్తారు.
నేడు పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్
110 ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్న జిల్లా సైన్స్ విభాగం
ప్రారంభించనున్న కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment