వలంటీర్ల జీవితాలతో ఆటలాడొద్దు
జిల్లా అసోసియేషన్ చైర్మన్ సత్తిబాబు
అమలాపురం టౌన్: వలంటీర్లకు అటు పెండింగ్ గౌరవ వేతనాలు ఇవ్వకుండా, ఉద్యోగాలను గాలిలో పెట్టి కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని జిల్లా వలంటీర్ల అసోసియేషన్ చైర్మన్ కె.సత్తిబాబు ఆరోపించారు. జిల్లా అసోసియేషన్ కో కన్వీనర్ ఆనంద్ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆదివారం జరిగిన చైతన్య యాత్ర ఉద్యమ దీప్తి కార్యక్రమంలో సత్తిబాబు ప్రసంగించారు. గ్రామ, వార్డు సచివాలయాలను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం వలంటీర్లకు పని చూపకుండా నిర్లక్ష్యం చేస్తోందని సత్తిబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, తాము అధికారంలోకి వస్తే వారి పారితోషికం రెట్టింపు చేస్తామని కూటమి పార్టీల ముఖ్య నేతలు హామీల వర్షం కురిపించి నేడు మరచిపోయారని ఆరోపించారు. అసోసియేషన్ జిల్లా కో కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ వలంటీర్లనే కాదు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని కూడా కూటమి ప్రభుత్వం మరచిపోయిందని ధ్వజమెత్తారు. జిల్లా అసోసియేషన్ ప్రతినిధుల తో కలసి వలంటీర్లు పలు ఇళ్లకు వెళ్లి అక్కడి ప్రజలకు తమ సేవలను గుర్తు చేశారు. సూర్యనగర్, సీతాపతిరావుపేట ప్రాంతాల్లో వీరి చైతన్య యాత్ర ఉద్యమ దీప్తి కార్యక్రమం సాగింది.
Comments
Please login to add a commentAdd a comment