దివ్యాంగులపై దోబూచిలాట | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై దోబూచిలాట

Published Mon, Jan 6 2025 7:56 AM | Last Updated on Mon, Jan 6 2025 7:56 AM

దివ్య

దివ్యాంగులపై దోబూచిలాట

పింఛన్ల తొలగింపునకు సర్వే అస్త్రం

కొత్త వాటికి అతీగతి లేదు

నేటి నుంచి పింఛన్ల వడబోత

ఆలమూరు: పింఛనుదారులకు పెద్ద కష్టం వచ్చింది.. కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంతో వారికి అవస్థలు తెచ్చిపెడుతోంది.. పేదలు, దివ్యాంగుల పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విధమైన నిబంధనలు లేకుండా అర్హులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని అటకెక్కించింది. కొత్త సంవత్సరంలోనైనా పింఛన్లను మంజూరు చేస్తారనుకునే లోపే ఇప్పుడు కొత్తగా సర్వే అస్త్రం వదిలేసింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత నవంబర్‌ నెలాఖరు వరకూ భర్త మృతి చెందితే స్పోజ్‌ కింద భార్యకు పింఛన్‌ బదలాయింపు జరగలేదు. పింఛన్‌ను పొందుతున్న భర్త మృతి చెందితే నిబంధనలకు అనుగుణంగా 15 రోజుల వ్యవధిలో భార్యకు పింఛన్‌ అందించాలి. ఇప్పటి వరకూ కూటమి ప్రభుత్వం ఆ పింఛన్లను మంజూరు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అయితే డిసెంబర్‌ నెలలో తూతూమంత్రంగా స్పోజ్‌ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్‌ను మంజూరు చేసింది. అధికార పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలో కొత్త పింఛన్‌ను మంజూరు చేయకపోగా, అనర్హుల పేరిట దివ్యాంగుల పింఛన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి దివ్యాంగుల పింఛన్ల తనిఖీ పేరిట కోతకు సిద్ధపడుతోంది. జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 2,16,990 మంది వివిధ పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో కొంతమందిని తొలగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.

అంతటా ఆందోళన

జిల్లాలో దివ్యాంగ పింఛన్ల తొలగింపుపై సోమవారం నుంచి సర్వే జరుగుతుందని అధికారులు ప్రచారం చేయడంతో అర్హుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో జిల్లా వ్యాప్తంగా 189 మందిని అనర్హులుగా గుర్తించారు. అందులో భాగంగానే దివ్యాంగుల పింఛన్లపై సమగ్ర సర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు గత డిసెంబర్‌ 9, 10 తేదీల్లో రెండో విడత సర్వే చేపట్టింది. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మండలంలోని ఒక గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకుంది. జిల్లాలో అల్లవరం మండలం గోడిలో గత నెలలో ప్రయోగాత్మకంగా దివ్యాంగ పింఛన్లపై రీసర్వే చేసింది. గ్రామసభ ఏర్పాటు చేసి సర్వేలో రూపొందించిన నివేదిక ఆధారంగా వివరాలను సేకరించి పింఛన్‌ను తొలగించే ప్రక్రియకు నాంది పలికింది. అదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది.

నలుగురు సభ్యులతో బృందంగా..

దివ్యాంగ పింఛన్లను సమగ్రంగా తనిఖీ చేసేందుకు వీలుగా ఆర్థోపెడిక్‌, జనరల్‌ వైద్యులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగి, గ్రామ పంచాయతీ అధికారులతో కూడిన నలుగురు సభ్యుల బృందం గ్రామాల్లో పర్యటించనుంది. తొలుత దివ్యాంగు పింఛన్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించి వికలాంగ అర్హతపై వివరాలు సేకరిస్తుంది. ఈ నెల ఆరు నుంచి 15 రోజుల పాటు జిల్లాలో మంచానికే పరిమితమైన 473 మంది దివ్యాంగులకు అర్హత పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షల్లో అనర్హులని తేలితే సాధారణ దివ్యాంగులకు ఇచ్చే రూ.ఆరు వేల పింఛన్లలో చేరుస్తారు. అలాగే రెండో విడతలో సాధారణ దివ్యాంగుల పింఛన్లను తనిఖీ చేస్తారు. ఈ పింఛన్ల తనిఖీల్లో అనర్హులు అని తేలితే వికలాంగ పింఛన్‌ను రద్దు చేయడంతో పాటు ధ్రువపత్రాన్ని మంజూరు చేసిన వైద్యాధికారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో చేరికలు.. నేడు తొలగింపులు

పేదల అభ్యున్నతే ధ్యేయంగా కుల మతాల కతీతంగా పాలన సాగించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఒక పింఛన్‌ను కూడా తొలగించలేదు. ఏటా క్రమం తప్పకుండా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లను మంజూరు చేసేది. గత ఏడాది జనవరిలో జిల్లా వ్యాప్తంగా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 7,489 పింఛన్లను మంజూరు చేశారు. అలాగే అప్పటి నుంచి జూన్‌ వరకూ (కూటమి సర్కారు వచ్చేనాటికి) గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో 8,467 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ మళ్లీ అఽధికారం చేపట్టి ఉంటే ఇప్పటికే ఉన్న పింఛన్లలో ఒకటి తొలగించకుండా ఉండే వారనే అభిప్రాయం దివ్యాంగుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే ఏటా జనవరి, జూలై నెలలో కచ్చితంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యే పరిస్థితి ఉండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

దశల వారీగా నిర్ణయం?

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అనర్హుల పేరిట పింఛన్లను దశల వారీగా తొలగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతలో రూ.15 వేలు పొంది మంచానికే పరిమితమైన రోగులను సర్వే చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొంతమందిని అనర్హుల జాబితాలో చేర్చారు. ఆ జాబితాలో ఉన్న మిగిలిన 493 మందికి ఈ నెల 20 లోపు పరీక్షలు నిర్వహించి వికలాంగత్వాన్ని నిర్ధారిస్తారు. అలాగే మలి విడతలో రూ.ఆరు వేల పింఛను పొందుతున్న దివ్యాంగులపై సర్వే జరిపి అనర్హులను చేసే విధంగా సర్వే జరుగుతోందని అంతా అనుకుంటున్నారు. భవిష్యత్‌లో వృద్ధ, వితంతు, కళాకారులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళల పింఛన్లు తొలగించే ప్రయత్నం చేస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరుల పింఛన్లను రద్దు చేసే యోచనలో అఽధికార పార్టీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వేలాది పింఛన్లు వివిధ కారణాలతో తొలగించినా ఇంకా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

అర్హులను గుర్తించేందుకే సర్వే

రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సక్రమంగా పింఛన్లను అందించేందుకు సర్వే చేపట్టింది. తొలి విడతలో జిల్లా వ్యాప్తంగా మంచానికి పరిమితమై రూ.15 వేలు పొందుతున్న దివ్యాంగులపై సర్వే జరుగుతుంది. అనంతరం మిగతా దివ్యాంగుల పింఛన్ల తనిఖీ కొనసాగుతుంది. దివ్యాంగుల పింఛన్లు నకిలీవని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రతి గ్రామంలో గుర్తించిన ప్రతి దివ్యాంగుడి నివాసానికి నలుగురు సభ్యుల బృందం వెళ్లి క్షుణ్ణంగా పరీక్షలు చేస్తోంది. –కె.దుర్గారావుదొర, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో పింఛనుదారులు

వృద్ధాప్య పింఛన్లు 1,29,297

వితంతువులు 49.906

దివ్యాంగులు 32,681

ఒంటరి మహిళలు 4,557

డయాలసిస్‌, ఫెరాలసిస్‌ 549

(రూ.15 వేలు పొందే రోగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
దివ్యాంగులపై దోబూచిలాట1
1/2

దివ్యాంగులపై దోబూచిలాట

దివ్యాంగులపై దోబూచిలాట2
2/2

దివ్యాంగులపై దోబూచిలాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement