రాత్రింబవళ్లు యంత్రాలతో తవ్వేస్తున్నారు
కపిలేశ్వరపురం: స్థానిక ఇసుక ర్యాంపులో రాత్రింబవళ్లు యంత్రాలతో తవ్వేస్తూ భారీ వాహనాల్లో ఇసుకను తరలించేస్తున్నారని, తమకు ఉపాధి కల్పించడం లేదని కూలీలు మంగళవారం ర్యాంపు వద్ద టెంటు వేసి నిరసన తెలిపారు. సుమారు 10 జట్లకు చెందిన తాము ర్యాంపులో లోడింగ్ పనిపై గంపెడాశలు పెట్టుకున్నామని కూలీలు బి.శ్రీనివాస్, పి.వెంకట్రావు, ఆర్.శ్రీనివాస్, ఎం.నారాయుడు, పి.రమణ అన్నారు. ర్యాంపు నిర్వాహకులు తమకు పని కల్పించడంలేదని, అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పనికోసం వెళ్తుండగా ర్యాంపులో ఇసుక నిల్వ ఉందని, పనిలేదని పంపించేస్తున్నారని కూలీలు చెబుతున్నారు. సుమారు 20 రోజులుగా ఇదే తంతు నడుస్తోందన్నారు. ర్యాంపు బాట పాడైపోయిందని. ట్రాక్టర్లు కాకుండా రాత్రింబవళ్లు యంత్రాలతో భారీ వాహనాల్లో ఇసుకను తరలించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలను తాము ఆపుతున్నా తమను లెక్క చేయడం లేదన్నారు. భారీ వాహనాల తాకిడికి బాట ఛిద్రం కావడంతో ట్రాక్టరు లోడింగ్ సాధ్యపడటం లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిబంధనల మేరకు శ్రమచేసి కుటుంబాలను పోషించుకుందామని ఆశిస్తున్నప్పటికీ ర్యాంపు వద్ద ఆ పరిస్థితులు లేవన్నారు. ర్యాంపు నిర్వాహకులు వచ్చి తమకు హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. నిర్వాహకులు జట్టు కూలీల నాయకులతో సంప్రదింపులు జరిపారు. పని కల్పించే విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కూలీలు తమ ఆందోళను విరమించారు.
కపిలేశ్వరపురం ర్యాంపులో
జట్టు కార్మికుల ఆందోళన
20 రోజులుగా పని చూపడం లేదని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment