బరితెగిస్తే ఖబడ్దార్
అమలాపురం టౌన్: సంక్రాంతిని ఎలాంటి అసాంఘిక కార్యలాపాలకు తావులేకుండా జిల్లా ప్రజలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఎస్పీ బి.కృష్ణారావు ఆకాంక్షించారు. కోడి పందేలు, గుండాటలు, పేకాటల వంటివి చట్టరీత్యా నేరమని, అవన్నీ నిషేధమని స్పష్టం చేశారు. సంక్రాంతి నేపథ్యంలో కొన్ని సూచనలు, హెచ్చరికలతో ఎస్పీ కృషారావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కోడి పందేల బరులు నిర్వహించడమే కాదు పాల్గొనడం కూడా నేరమమని ఎస్పీ గుర్తు చేశారు. జిల్లాలోని రైతులకు చెందిన లేదా ఇతర భూ యాజమానులు వారి స్థలాల్లో కోడిపందేలకు, గుండాటలకు, అశ్లీల నృత్యాలకు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని పేర్కొన్నారు. గౌరవ హైకోర్టు మార్గ దర్శకాలు, ఆదేశాలతో జీవహింస నిరోధానికి ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, తహసీల్దార్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో మండల స్థాయి సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీ బృందాలకు విశేష అధికారులు ఉంటాయని, క్షేత్ర స్థాయిలో ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మీమీ ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాటలు, అశ్లీల నృత్యాల సమాచారంతో పాటు కత్తుల కట్టే వారు, పందేలకు స్థలాలు ఇచ్చేవారు, కోళ్ల పెంపకందార్లు ఇలా ఏ సమాచారం తెలిసినా తక్షణమే 112కి డయల్ చేయడం లేదా స్పెషల్ బ్రాంచి కంట్రోల్ రూమ్ ఫోన్ 8143792101 నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. విజయవాడ నుంచి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం సంస్థాగత కార్యాలయం ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఈదరపల్లిలోని ఎస్‌ఈ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఈ ఎస్.రాజబాబు, ఈఈ మోకా రవికుమార్ పాల్గొన్నారు. విద్యుత్ నియత్రణ మండలి అన్ని డిస్కమ్‌ల టారీఫ్‌ల ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు అభ్యంతరాలు తీసుకున్నారు. బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పుగంటి భాస్కరరావు మాట్లాడుతూ రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ఎస్సీ ఎస్. రాజబాబు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు టారీఫ్‌ల ఫైలింగ్‌పై సందేహాలు, సూచనలు తెలిపేందుకు ముందుగా ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాల్లో అనుమతి తీసుకోవాలన్నారు. 8,10 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఎస్‌ఏఓ కె.సత్యకిషోర్, డీఈఈ అన్నవరం, ఏఈలు పాల్గొన్నారు.
తెల్లవారుజాము నుంచీ దర్శనాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఆలయాలకు వచ్చే భక్తులకు తెల్లవారుజామున 5 గంటల నుంచే దర్శనాలు కల్పించాలని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు ఈఓలను, అర్చకులను ఆదేశించారు. కాకినాడలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, వైష్ణవ ఆలయాలకు చెందిన ఈఓలు, అర్చకులతో తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాలు ఎట్టి పరిస్థితుల్లోను ఆ సమయంలోగా తెరవాలని స్పష్టం చేశారు. ఆలయం తెరిచే సమయానికే భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు అందించాలన్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలను, పరిసరాలను అందంగా ముస్తాబు చేయాలని చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా టెంట్లు వేయడంతో పాటు మజ్జిగ, మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఈవోలను ఆదేశించారు. గత ఏడాది ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం 6.30 దాటినా కొన్ని ఆలయాలు తెరవలేదంటూ పలు ఫిర్యాదులు అందాయన్నారు. తెల్లవారుజామున ఆలయాలు తెరవని ఈఓలు, అర్చకులపై చర్యలు తీసుకుంటామని రమేష్‌బాబు హెచ్చరించారు. సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి అల్లు గంగాభవాని, ఆ శాఖ తనిఖీదారు వడ్డి ఫణీంద్రకుమార్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment