కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న
జాతీయ రహదారి 216 పనులు ఇప్పటికీ పలుచోట్ల పూర్తి కాలేదు. రైల్వే ఫ్లై ఓవర్లు, బైపాస్ రోడ్ల భూసేకరణకు అవాంతరాల వల్ల రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇదే సమయంలో ఈ రహదారిని ఆరు.. నాలుగు వరుసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
సాక్షి, అమలాపురం: కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 216 జాతీయ రహదారి పనులు 2015లో రూ.నాలుగు వేల కోట్ల అంచనాతో మొదలయ్యాయి. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ఒంగోలు జిల్లాల మీదుగా ఇది సాగుతోంది. కోస్తా ఆంధ్రాకు జీవనాడి ఈ రహదారి. జాతీయ రహదారి 16కు సమాంతరంగా ఈ రహదారి ఉంది. ఇటీవల రాకపోకలు రెట్టింపయ్యాయి. కత్తిపూడి నుంచి కాకినాడ పట్టణ శివారు తిమ్మాపురం వరకు నాలుగు వరుసలుగాను, అక్కడ నుంచి ఒంగోలు వరకు రెండు వరుసలుగా నిర్మిస్తున్నారు. పనులు మొదలై తొమ్మిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పలు కీలక ప్రాంతాల్లో పూర్తి కాలేదు. ఇతర జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే లతో పోల్చుకుంటే ఈ రహదారి నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ, ఇతర సాంకేతిక అనుమతులు సాధించడంతో పనులు వేగమందుకున్నాయి.
భూ సేకరణతో సామాన్యులు, వ్యాపారులకు నష్టం
ఇప్పుడు ఈ రహదారిని ఆరు వరుసలు, నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 390 కిమీల పొడవున ఉన్న ఈ రహదారిని కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఆరు వరుసలు, అక్కడ నుంచి ఒంగోలు వరకు నాలుగు వరుసల నిర్మాణం చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు ఎన్‌హెచ్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగానే రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి ఉంటే వేరేగా ఉండేది. కాని తొలుత రెండు వరుసలు చేసి ఇప్పుడు నాలుగు వరుసలుగా మార్చి భూసేకరణ చేస్తే పలు గ్రామాలకు చెందిన సామాన్యులు, వ్యాపారులు నష్టపోనున్నారు. ప్రధానంగా జాతీయ రహదారి నిర్మాణం జరిగిన తరువాత చాలామంది వీటిని ఆనుకుని వ్యాపార, వాణిజ్య సముదాయాలను నిర్మించారు. కాకినాడ జిల్లాలో పండూరు, చిత్రాడ, కోరంగి, మట్లపాలెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మురమళ్ల, శివకోడు, పశ్చిమ గోదావరి జిల్లా లోసరి, కృష్ణా జిల్లా కృతివెన్ను వంటి గ్రామాల్లో భూసేకరణ వల్ల స్థానికులు నష్టపోయే పరిస్థితి నెలకొననుంది.
పూర్తికాని రైల్వే ఫ్లై ఓవర్లు
కాకినాడ బైపాస్‌తోపాటు, కృష్ణా జిల్లా పెడన వద్ద రైల్వే ఫ్‌లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తికాలేదు. తిమ్మాపురం వై.జంక్షన్ నుంచి కాకినాడ మండలం తూరంగి వరకు నిర్మిస్తున్న బైపాస్ వినియోగంలోకి రాలేదు. ఈ దారికి సంబంధించి కొవ్వాడ వద్ద, అచ్చంపేట వద్ద నిర్మించిన ఫ్‌లై ఓవర్ అప్రోచ్ రోడ్డు గోడలు కుంగిపోయాయి. మాధాపురం వద్ద రైల్వే లైన్ క్రాసింగ్ వద్ద నిర్మిస్తున్న ఫ్‌లై ఓవర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కృష్ణా జిల్లా పెడన వద్ద సైతం రైల్వేలైన్‌పై నిర్మించే ఫ్‌లై ఓవర్ అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయలేదు. భూ సేకరణ సమస్య వల్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాశర్లపూడి వంతెన వద్ద నుంచి శివకోడు వరకు బైపాస్ నిర్మాణ పనులు సైతం అసంపూర్తిగా ఉన్నాయి.
మామిడికుదురు జూనియర్ కాలేజీ వద్ద నిలిచిపోయిన 216 జాతీయ రహదారి విస్తరణ పనులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన 216 జాతీయ రహదారిలోని అమలాపురం బైపాస్ రోడ్డు
216 హైవే రెండు వరుసలు పూర్తి
కాకుండానే నాలుగు లేన్లకు నిర్ణయం
జాతీయ రహదారిపై కాకినాడ, పెడన వద్ద పూర్తి కాని రైల్వే ఫ్లై ఓవర్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జోరుగా సాగిన పనులు
నాలుగు వరుసలైతే మారనున్న పలు గ్రామాల రూపురేఖలు
216పై ఇటీవల భారీగా పెరిగిన వాహనాల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment