సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజల కష్టాలు విని.. చలించి.. స్పందించి.. అవసరమైన సహాయం అందించి.. తోడుగా ఉన్నాననే మనోధైర్యం కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అగ్రస్థానమనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవల కొవ్వూరులో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన సభకు వచ్చిన ఆయనకు.. పలువురు వివిధ సమస్యలపై వినతులు ఇవ్వడం.. వారిలో ఇటీవల అనేక మందికి రూ.21 లక్షల మేర ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఓ దివ్యాంగుడికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ భరోసా కల్పించారు. జిల్లాలోని గోపాలపురానికి చెందిన చల్లా వీర నాగరాజు బీకాం పూర్తి చేసి, ప్రస్తుతం ఎంకాం చదువుతున్నాడు. 2015లో ప్రమావశాత్తూ విద్యుత్ షాక్‌తో 98 శాతం శారీరక అంగవైకల్యానికి గురయ్యాడు.
నాటి టీడీపీ ప్రభుత్వంలో ఇతడికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రస్తుతం మానవత్వంతో స్పందించే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన రావడంతో.. అతడు తన సమస్యను స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, హోం మంత్రి తానేటి వనిత దృష్టికి తీసుకువెళ్లాడు. నాగరాజు దుస్థితి చూసి ఎమ్మెల్యే, మంత్రి చలించిపోయారు. వారి సూచన మేరకు ఈ నెల 24న కొవ్వూరు సభకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా కలిశాడు. అతడి కష్టాలపై స్పందించిన సీఎం జగన్.. రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు.
ఈమేరకు చెక్కును కలెక్టర్ కె.మాధవీలత శనివారం కలెక్టరేట్‌లో నాగరాజుకు అందజేశారు. చదువుతో సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని, చదువు కొనసాగించాలని అతడికి సూచించారు. ముఖ్యమంత్రి అందజేసిన ఆర్థిక సహాయంతో జీవనోపాధికి అవసరమైన యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆసక్తి మేరకు జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన నైపుణ్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వలంటీర్ ప్రతి నెలా తన ఇంటికి వచ్చి రూ.3 వేలు పెన్షన్ అందిస్తున్నారని నాగరాజు చెప్పాడు. తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన సీఎంకు, హోం మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన కష్టంపై స్పందించి, సాయం అందించిన సీఎం జగన్ మనసున్న మారాజు అని నాగరాజు కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment