![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/18/544.jpg.webp?itok=1sHy-sOA)
ఆలమూరు: జార్జియా దేశంలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి సిడిగం హేమంత్ అశ్విన్ ఆకాష్ (21) అదృశ్యమయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ (నాయుడు) తన ద్వితీయ కుమారుడైన హేమంత్‌ను 2022లో హైదరాబాద్‌కు చెందిన వీ సోర్స్ కన్సల్టెన్సీ ద్వారా జార్జియాలోని ఇల్లియా స్టేట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివేందుకు చేర్పించారు.
అప్పటి నుంచి కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన హాస్టల్‌లో ఉంటూ చదువుకుని సెలవులపై తరచూ స్వగ్రామైన ఆలమూరుకు హేమంత్ వస్తుండేవాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి వచ్చేందుకు రానూ పోనూ విమాన టిక్కెట్లు తీసుకున్నాడు. హేమంత్‌కు చెందిన మొబైల్ ఫోన్ ఆదివారం రాత్రి నుంచి పనిచేయడం లేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో ఆందోళన చెంది వీ సోర్స్ కన్సల్టెన్సీని సంప్రదించారు.
దీంతో హాస్టల్‌లో ఉంటున్న సహచర విద్యార్థులను ఆ కన్సల్టెన్సీ సంప్రదించగా స్థానిక బీచ్‌కు వెళతానని చెప్పి ఒక్కడే బయటకు వెళ్లిపోయాడని, తరువాత తమకు కనిపించలేదని చెప్పడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, లలిత దంపతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన సత్వరమే స్పందించి విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం
స్నేహితులపై అనుమానం
తమ కుమారుడు హేమంత్ అవినాకాష్ కనిపించకుండా పోయి 24 గంటలైనా ఇప్పటి వరకూ హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థులు స్పందించలేదని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తన కుమారుడు కనిపించకుండా పోవడానికి సహచర విద్యార్థుల్లో కొంతమంది కారణమని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన కుమారుడి ఆచూకీ తెలపాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment