చెదరని కీర్తి.. నిత్య స్ఫూర్తి
అది 1924వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ. సమయం తెల్లవారుజామున నాలుగు గంటలు కావస్తోంది. రాజమహేంద్రవరానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతానగరం గ్రామంలో ఒక ఆశ్రమానికి శంకుస్థాపన జరుగుతోంది. వ్యవస్థాపకుడు గాంధేయవాది డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం. ఆ చిమ్మచీకటిలో మహర్షి బులుసు సాంబమూర్తి తాళ్ళపూడి గ్రామం వద్ద గోదావరి నదిని దాటుకుని, సీతానగరం ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. ‘గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం’ అని నామకరణం చేశారు. అదే సమయానికి ‘ఈ ఆశ్రమం భావవికాసాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అనే సందేశంతో మహాత్మా గాంధీ టెలిగ్రామ్ పంపించారు. ఇది ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజల్లో నూతన స్ఫూర్తిని నింపింది. అనతి కాలంలోనే స్వాతంత్య్ర పోరాటానికి యువతను సిద్ధం చేసే శిక్షణా కేంద్రంగా ఈ ఆశ్రమం రూపుదిద్దుకుంది. దక్షిణ సబర్మతిగా, అహింసా స్వాతంత్య్ర సంగ్రామ కురుక్షేత్రంగా చరిత్రకారుల మన్ననలు అందుకుంది. ఆనాడు ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా ఈ ఆశ్రమం మారిందంటే అతిశయోక్తి కాదు.
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆశ్రమ వ్యవస్థాపకుడు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా ఫిరంగిపాడు సమీపంలోని ముగ్గళ్ల గ్రామంలో 1891 అక్టోబర్ 12న జన్మించారు. తండ్రి రామశాస్త్రి, తల్లి లక్ష్మీ నరసమ్మ. కోల్‌కతాలో వైద్య విద్య అభ్యసించిన ఆయన, మిత్రుల సలహాపై 1917లో రాజమండ్రి కంభంవారి సత్రం సమీపాన ప్రాక్టీస్ ప్రారంభించారు. హస్తవాసి మంచిదని పేరు రావడంతో సంపాదనకు లోటు లేకపోయింది. మహాత్ముని పిలుపు మేరకు నాడు దేశ స్వాతంత్య్రోద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న సంధికాలమది. మహాత్ముని పిలుపుతో ఉత్తేజితులైన వేలాది మంది యువకుల్లో ఒకరైన బ్రహ్మజోస్యుల శాసనోల్లంఘన తదితర కార్యక్రమాల్లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు. స్వరాజ్య సాధనకు గాంధీజీ రూపొందించిన నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఒక ఆశ్రమం నిర్మించాలని భావించారు. శేఠ్ జీవన్‌లాల్ అనే అల్యూమినియం వ్యాపారి, కాంగ్రెస్ అభిమాని అందించిన ఆర్థిక సాయంతో ఆయన సీతానగరంలో ఆశ్రమాన్ని నిర్మించారు. ఖద్దరు వాడకం, అంటరానితనం నిర్మూలన, హరిజనుల ఆలయ ప్రవేశం, స్వరాజ్య పోరాటానికి ప్రజలను ఆయత్తం చేయడం ఈ ఆశ్రమ లక్ష్యాలు. బ్రహ్మజోస్యులతో పాటు చండ్రపట్ల హనుమంతరావు, క్రొవ్విడి లింగరాజు, మద్దూరి అన్నపూర్ణయ్య, గూడూరి రంగయ్య, ధరణీప్రగడ శేషగిరిరావు, ఓలేటి నరసింహం తదితరులు సతీసమేతంగా ఆశ్రమంలో నివాసం ఏర్పాటు చేసుకుని, ఉద్యమంలో పాల్గొన్నారు. శిక్షలు అనుభవించారు.
అపురూప జ్ఞాపకాలు
ఫ సీతానగరం ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ 1929, 1933 సంవత్సరాల్లో సందర్శించారు. మొదటిసారి ఆయన సతీసమేతంగా వచ్చారు. లోకమాన్య జయప్రకాష్ నారాయణ కూడా ఆయనతో ఉన్నారు. ఆయన బస చేసిన కుటీరం, ఉపయోగించిన రాట్నం నేటికీ ఈ ఆశ్రమంలో ఉన్నాయి. కుటీరంపై కప్పును మాత్రం మార్చారు.
ఫ ఆశ్రమంలోని జెండా స్తంభంపై ఉన్న జెండాను ఊడబెరకడానికి నాటి కిరాతక డీఎస్పీ ముస్తఫా ఆలీఖాన్ ప్రయత్నించగా.. గుత్తి సుబ్బరాజు అనే 70 ఏళ్లు పైబడిన వృద్ధుడు ప్రతిఘటించి, అరెస్టు అయ్యాడు. ఈ సంఘటనకు తార్కాణంగా నేటికీ ఆశ్రమంలో జెండా స్తంభాన్ని అలాగే ఉంచారు.
ఫ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసంగించడానికి వచ్చిన వేదికను, ఆశ్రమ వాసులు ఉపయోగించిన బావిని సైతం నేటికీ ఇక్కడ సందర్శకులు చూడవచ్చు.
సంచలనం రేపిన కాంగ్రెస్ పత్రిక
దేశంలో జరుగుతున్న స్వరాజ్య ఉద్యమం పట్ల ప్రజలను చైతన్యపరచడానికి మద్దూరి అన్నపూర్ణయ్య వ్యవస్థాపక సంపాదకునిగా ప్రారంభమైన కాంగ్రెస్ పత్రిక పెనుదుమారం లేపింది. ఆ పత్రికకు చెందిన ఐదుగురు వరుస సంపాదకులు– మద్దూరి అన్నపూర్ణయ్య, కాండ్రేగుల రామచంద్రరావు, చండ్రుపట్ల హనుమంతరావు, క్రొవ్విడి లింగరాజు, రామచంద్రుని వెంకటప్ప ఉత్తేజకరమైన సంపాదకీయాలు రాసి, జైలు శిక్షలు అనుభవించారు.
ఆశ్రమంపై నిషేధం
నాటి ప్రభుత్వం ఈ ఆశ్రమాన్ని 1932లో ‘అక్రమ సంఘం’గా ప్రకటించింది. పోలీసు అధికారులు ఆశ్రమ ఆస్తులను, పత్రిక ముద్రణా యంత్రాన్ని సామగ్రిని ధ్వంసం చేశారు. అదే సంవత్సరం నాళం భీమరాజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మజోస్యులను బయటకు లాగి, దారుణంగా ముస్తఫా ఆలీఖాన్ లాఠీలతో చావబాదాడు. ఈ దాడిలో పక్కటెముకలు విరగడంతో ఆయన క్షయవ్యాధికి లోనయ్యారు. 1936 డిసెంబర్ 26వ తేదీ ముక్కోటి ఏకాదశి నాడు స్వాతంత్య్ర భానూదయాన్ని చూడకుండానే బ్రహ్మజోస్యుల కన్ను మూశారు. ఈ ఆశ్రమ నిర్వహణను 1947లో కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక ట్రస్టు చేపట్టింది. రాజమహేంద్రవరంలో బ్రహ్మజోస్యుల పేరిట సుబ్రహ్మణ్యం మైదానం ఉంది. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతాయి.
శతవార్షికోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
ఈ ఆశ్రమ శత వార్షికోత్సవం నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్రమం చరిత్రను తెలిపే స్థూపం, ఆశ్రమ వ్యవస్థాపకుడు బ్రహ్మజోస్యుల, ఆశ్రమంలో నివసించిన స్వాతంత్య్ర పోరాట యోధులు క్రొవ్విడి లింగరాజు, వంగవేటి వేంకట్రామ దీక్షితుల విగ్రహావిష్కరణలు, విశ్రాంత ప్రిన్సిపాల్ బి.రాజారావు రచించిన దక్షిణ సబర్మతి – గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు ఈ సందర్భంగా జరగనున్నాయి. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికార, అనధికార ప్రముఖులు పాల్గొంటారు.
త్యాగనిరతి ఆశ్రమం
అంతస్సూత్రం
వ్యక్తులను ఆసరాగా చేసుకుని సమూహం, సమూహాలను ఆసరాగా చేసుకుని వ్యక్తులు చైతన్య జ్యోతులను వెలిగించిన నాటి పరిస్థితులు తలుచుకుంటే శరీరం పులకరిస్తుంది. ఆశ్రమం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, త్యాగనిరతి అనే అంతస్సూత్రం దీనిని బతికించి ఉంచింది.
– డాక్టర్ అరిపిరాల నారాయణరావు,
విశ్రాంత ఆచార్యుడు
పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి
1991లో జరిగిన ఆశ్రమ వ్యవస్థాపకుడు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేను రచించిన ‘సీతానగర సేవాశ్రమ చరిత్ర’ పుస్తకాన్ని పద్మవిభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆవిష్కరించారు. ప్రస్తుతం నేను రచించిన ‘దక్షిణ సబర్మతి–గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం’ పుస్తకాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ శనివారం ఆవిష్కరించనున్నారు. ఈ ఆశ్రమాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
– బి.రాజారావు, విశ్రాంత ప్రిన్సిపాల్
వనరులకు కొరత
ఆశ్రమంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉంది. ప్రభుత్వ చేయూతతో పాటు వదాన్యుల సహకారం కావాలి.
– జి.సుశీల, ట్రస్టు ప్రాంతీయ ప్రతినిధి
ఖద్దరు ఆయన ఆరో ప్రాణం
ఖద్దరు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఆరో ప్రాణం. ఆయనకు సంతానం ఆలస్యంగా కలగడంతో తన అన్నగారి కుమార్తె కనకాన్ని పెంచుకున్నారు. ఆమె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు, వరుని కుటుంబంలోని వారికి ఖద్దరు కట్టే అలవాటు ఉన్నదని తెలిసి, ఆయన సంబంధానికి అంగీకరించారు. వృత్తి రీత్యా డాక్టర్ కనుక, ఆశ్రమ ప్రాంగణంలో ఒక ఆధునిక ఆసుపత్రి లేదా వృద్ధాశ్రమం నిర్మించాలని, పేదలకు ఉచితంగా సేవలు అందించాలన్నది నా కోరిక.
– బ్రహ్మజోస్యుల సత్యవతి, సుబ్రహ్మణ్యం కోడలు
ఆశ్రమ చరిత్రను తెలియజెప్పాలి
గోదావరి పరీవాహక ప్రాంతంలో స్వాతంత్య్ర ఉద్యమం, సీతానగరం ఆశ్రమ చరిత్ర రెండూ పెనవేసుకుని ఉన్నాయి. స్ఫూర్తిదాయకమైన ఈ చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాలి.
– వారణాసి సుబ్రహ్మణ్యం,
బ్రహ్మజోస్యుల మనవడు, రచయిత
·˘ Ôèæ™èl Ð]lçÜ…™éÌS "§ýl„ìS×æ çܺÆý‡Ã†'˘
·˘ ÝëÓ™èl…[™øŧýlÅÐ]l$ çÜ*¹Ç¢° Æý‡WÍa¯]l
గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం
·˘ G…§ýlÆø ™éÅVýS«§ýl¯]l$ÌS _Æý‡$¯éÐ]l*
·˘ ïÜ™é¯]lVýSÆý‡…ÌZ ¯ésìæ
జ్ఞాపకాలు నేటికీ పదిలం
·˘ Æó‡ç³# Ôèæ™èlÐéÇÛMø™èlÞÐ]l…
Comments
Please login to add a commentAdd a comment