ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలం
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఈ నెల 18న సచివాలయాల వద్ద వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.6 వేల కోట్లు పైగా విద్యుత్ బిల్లుల భారం మోపాలని నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎన్నికల్లో తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెబుతూ, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రజలపై భారాలు మోపాలనుకోవడం అవివేకమని వనజ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గర్భస్థ లింగ
నిర్ధారణ పరీక్షలు నేరం
రాజమహేంద్రవరం రూరల్: స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరమని, అలా ఎవరైనా చేస్తే శిక్ష తప్పదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కె.వెంకటేఽశ్వరరావు అన్నారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో రూరల్, అర్బన్ పీహెచ్‌సీల వైద్యాధికారులకు పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తక్కువ లింగ నిష్పత్తి ఉన్న దోసకాయలపల్లి, మార్కొండపాడు, పాలచర్ల, దేవరపల్లి, తాళ్లపూడి పీహెచ్‌సీలు, రాజమహేంద్రవరం వీఎల్ పురం, వాంబే కాలనీ, కంబాలపేట, మెరకవీధి, ఆనంద నగర్, ఇన్నీసుపేట, శంభునగర్, అద్దేపల్లి కాలనీ, నిడదవోలు నెహ్రూనగర్, కొవ్వూరు ఎన్‌జీఓ హోమ్ సొసైటీ యూపీహెచ్‌సీల వైద్యాధికారుల నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోని స్కానింగ్ సెంటర్లను తరచుగా తనిఖీ చేయాలన్నారు. అనుమానిత స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్ చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, హై రిస్క్ గర్భిణులను సామాజిక, ప్రభుత్వాస్పత్రులకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు. ఐసీడీఎస్, స్వయం సహాయక సంఘాల గ్రూపులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 970 మంది ఆడ శిశువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment