ఇసుక కోసం పడిగాపులు
● తీపర్రు ర్యాంపులో ఇసుక ఎగుమతి చేయని నిర్వాహకులు
● వందలాదిగా నిలచిన లారీలు, ట్రాక్టర్లు
● పాత బాటలో ఉచిత ఇసుక లోడింగ్‌ను అడ్డుకున్న అధికారులు
● ఇరువర్గాల మధ్య వాగ్వాదం
పెరవలి: మండలంలోని తీపర్రు ర్యాంపు వద్దకు వందలాది లారీలు, ట్రాక్లర్లతో వచ్చిన వారు మంగళవారం ఇసుక కోసం పడిగాపులు పడ్డారు. లారీలకు, ట్రాక్టర్లకు ర్యాంపు నిర్వాహకులు ఇసుక ఎగుమతి చేయలేదంటూ డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వందలాది వాహనాలతో ర్యాంప్ బాట పూర్తిగా నిండిపోయింది. దీంతో రైతులు సైతం ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ఉచిత ఇసుక కోసం వచ్చిన ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు పక్కనే ఉన్న పాత బాటలోకి వెళ్లి లోడ్ చేసుకోవడం ఆరంభించారు. దీనిపై లారీ డ్రైవర్లు ఆగ్రహించారు.
అడ్డుకున్న తహసీల్దార్
విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ డి.అచ్యుత కుమారి అక్కడకు చేరుకుని, ట్రాక్టర్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చూపి న బాటలోకి వెళ్తూంటే కాంట్రాక్టరు ఇసుక ఎగుమతి చేయడం లేదని, ఉచిత ఇసుక తీసుకుని వెళ్లకుండా ఎందుకు అడ్డు తగులుతున్నారని ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు ఎదురు నిలదీశారు. ఈ క్రమంలో అధికారులు, ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు సుమారు గంటపాటు పరస్పరం కేకలు వేసుకున్నారు. ఒక దశలో ఎవరు ఎవరిని ఏమి అడుగుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వాహనాలను అడ్డుకుని, ఇసుక ఎగుమతి చేయరాదని కూలీలను హెచ్చరించారు. దీనిపై ట్రాక్టర్ల యజమానులు మరింత ఆగ్రహించారు. ఏం తప్పు చేశామని తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ వివాదంతో పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి ఇసుక కోసం వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
అధికారులపై డిప్యూటీ కలెక్టర్ ఆగ్రహం
అదే సమయంలో డిప్యూటీ కలక్టర్ ఖతీబ్ కౌసర్ బానో ర్యాంప్ వద్దకు చేరుకున్నారు. ‘ఉదయం నుంచీ ఇసుక లోడ్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇంత మంది సిబ్బంది ఉండి పట్టుమని 10 లారీలు కూడా ఎగుమతులు చేయలేదంటే మీరంతా ఎందుకున్నట్టు? నేను ఫోన్ చేస్తూంటే ఇసుక లోడింగ్ జరుగుతోందని ఎందుకు చెప్పారు? వాస్తవ పరిస్థితి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ చూస్తే ఎటువంటి లోడింగ్ జరగడం లేదు’ అంటూ అధికారులపై మండిపడ్డారు. లారీలకు వెంటనే ఇసుక ఎగుమతి చేయాలని ఆదేశించారు. ఇంతలో ట్రాక్టర్ల యజమానులు ఆమెను చుట్టుముట్టారు. తమకు అవసరమున్నప్పటికీ ర్యాంపులోకి వెళ్తే ఇసుక ఎగుమతి చేయటం లేదని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ అచ్యుత కుమారిని డిప్యూటీ కలెక్టర్ ఆదేశించారు.
లంకల వద్ద తవ్వకాలు వద్దు
అదే సమయంలో పలువురు రైతులు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. లంకల పక్కనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివలన వరదల సమయంలో లంకలు కోతకు గురై, తమ పంట పొలాలు గోదావరిలో కలసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మైనింగ్ విభాగం ఇచ్చిన సర్వే నంబర్లు ఎక్కడున్నాయో కొలతలు వేయాలని సర్వేయర్‌ను ఆదేశించారు. వారి సర్వే ప్రకారం ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో ఇసుక తవ్వాల్సి ఉందని తేలింది. దీంతో కంగు తిన్న అధికారులు చివరకు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లోనే ట్రాక్టర్లతో ఇసుక తీసుకుని వెళ్లవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment