పోటీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్మన్ కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై ఆయన సమన్వయ శాఖల అధికారులు, జిల్లా నోడల్ అధికారి టి.సీతారామ్మూర్తితో కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరీక్షలను రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లోని అయాన్ డిజిటల్ జోన్, ఐడీ జెడ్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకూ జరగనుందన్నారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందు అభ్యర్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని జేసీ స్పష్టం చేశారు.
అలాగే, వచ్చే నెల 4 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్మన్ కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిపాయి పోస్టులకు 14,672 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని జేసీ చిన్నరాముడు వివరించారు. ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి 10 వరకూ, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకూ మూడు షిఫ్టులుగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బారావు, తహసీల్దార్ పాపారావు, డిప్యూటీ తహసీల్దార్ బీవీ కృష్ణశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ క్రికెట్ పోటీలకు సాహితిశ్రీ
దేవరపల్లి: హర్యానాలోని పంచకులలో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకూ జరగనున్న జాతీయ అండర్–17 బాలికల ఎస్జీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు దేవరపల్లి జెడ్పీ హైస్కూలు విద్యార్థిని ఓరుగంటి సాహితీశ్రీ ఎంపికై ంది. ఈ జట్టు గురువారం పంచకులకు బయలుదేరిందని స్థానిక అంబటి సత్యనారాయణరావు జెడ్పీ హైస్కూలు వ్యాయామోపాధ్యాయుడు ఓరుగంటి నాగరాజు తెలిపారు. ఈ జట్టుకు ఈ నెల 27 నుంచి 30 వరకూ గుంటూరులోని శుభం క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. క్రీడాకారులకు గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి మల్లెంపు రవి, టీం కోచ్ డి.భూపాల్‌రెడ్డి, మేనేజర్ శివప్రియ, క్రికెట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కరీముల్లా చౌదరి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ డి.భాస్కరరావు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment