![హెల్మ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30rjc201-270080_mr-1738269142-0.jpg.webp?itok=WRAIwe2-)
హెల్మెట్ భారం కాదు.. బాధ్యత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) హెల్మెట్ ధరించడం భారం కాదని, అది మనందరి బాధ్యతని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ, జిల్లా రవాణా శాఖాధికారి ఆర్.సురేష్ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో సుమారు 200 మంది మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు, సిబ్బంది, మహిళా రక్షక్ టీములు, డబ్ల్యూఎంఎస్‌కే, జీఎంఎస్‌కేలతో గురువారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ, సురేష్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, గమ్యాలకు సురక్షితంగా చేరుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జేఎన్ రోడ్డు, రామాలయం సెంటర్, ముగ్గుపేట సెంటర్, ఆజాద్ చౌక్, దేవీచౌక్, కంబాలచెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్ వరకూ ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి బయలుదేరి హైటెక్ బస్టాండ్, వై జంక్షన్, సెంట్రల్ జైలు రోడ్డు, లాలాచెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకూ తిరిగి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్‌పీ (ఎస్‌బీ) రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు (ఎస్‌బీ), నబీ (ట్రాఫిక్–1), సూరిబాబు (ట్రాఫిక్–2), మంగాదేవి (మహిళా పోలీస్ స్టేషన్) తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీలకు
రిజర్వేషన్ల ఖరారు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన కార్యవర్గాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిందని జిల్లా మార్కెటింగ్, ట్రేడింగ్ అధికారి సునీల్ వినయ్ గురువారం విలేకర్లకు తెలిపారు. రాజమహేంద్రవవరం, కొవ్వూరు, గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఓసీకి, అనపర్తి, రాజానగరం బీసీ (వుమన్), నిడదవోలు ఎస్సీ (వుమన్)కు ఖరారు చేశారని వివరించారు.
1, 3న ఇంటర్ ఫస్టియర్
విద్యార్థులకు పరీక్షలు
కంబాలచెరువు: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1న నైతికత, మానవీయ విలువలు, 3న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహాం గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు జనరల్ విభాగంలో 20,591 మంది, వృత్తివిద్యా కోర్సుల్లో 2,226 మంది హాజరవుతారన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.
60 వేల హెక్టార్లలో ఎలుకల
సామూహిక నిర్మూలన
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా 60 వేల హెక్టార్లలో ఎలుకల సామూహిక నిర్మూలన చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తొర్రేడు గ్రామంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఎలుకలు వరి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, వాటి స్వభావాన్ని బట్టి యాజమాన్య చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలుకల నిర్మూలన మందును రైతులకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్‌వీ నరసింహారావు మాట్లాడుతూ, రైతులందరూ ఒకేసారి విత్తనం, నాట్లు వేసుకోవడం, బుట్టలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలుకల వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. అనంతరం వరి పొలాల్లో విషపు ఎర తయారీ విధానాన్ని రైతులకు వ్యవసాయ అధికారులు చేసి చూపించారు. ఎలుకల నివారణ మందు కలిపేటప్పుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, విషపు ఎరలను సాయంత్రం మాత్రమే అమర్చాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌సీ ఏడీఏ జయ రామలక్ష్మి, రాజమహేంద్రవరం ఏడీఏ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ అధికారి భీమరాజు, విస్తరణ అధికారులు వేణుమాధవరావు, పీటర్ తదితరులు పాల్గొన్నారు.
![హెల్మెట్ భారం కాదు.. బాధ్యత 1](https://www.sakshi.com/gallery_images/2025/01/31/30rjc07-600529_mr-1738269142-1.jpg)
హెల్మెట్ భారం కాదు.. బాధ్యత
![హెల్మెట్ భారం కాదు.. బాధ్యత 2](https://www.sakshi.com/gallery_images/2025/01/31/30rjc207-270080_mr-1738269142-2.jpg)
హెల్మెట్ భారం కాదు.. బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment