![పాఠశా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rjc106-270083_mr-1738867028-0.jpg.webp?itok=HXaRT9nm)
పాఠశాల విద్యను పరిరక్షించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాఠశాల విద్యను కాపాడాలని, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యాన వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ఎదుట గురువారం ఆందోళన చేశారు. ఏపీటీఎఫ్ (1938), పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, డీటీఎఫ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. నివాసాలకు 1, 3, 5 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల నమోదు 40 శాతం దాటిన అన్ని ప్రాథమిక పాఠశాలలకు విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఆంగ్ల బోధనకు ఒక పోస్టు ఇవ్వాలని, 50 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.భానుప్రకాష్, పట్టణ అధ్యక్షుడు దినేష్, కార్యదర్శి మణికంఠ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సునీల్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డేవిడ్ లివింగ్‌స్టన్, కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయబ్రహ్మం, గౌరవాధ్యక్షుడు అప్పయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
కుంభమేళాకు రేపు ప్రత్యేక రైలు
కాకినాడ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రైల్వే శాఖ కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి శనివారం మరో అదనపు రైలు ఏర్పాటు చేసింది. 07095 నంబర్‌తో నడిచే ఈ రైలు కాకినాడలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది. రెండు రోజుల తర్వాత ప్రయాగ్ రా జ్ చేరుతుంది. కాగా, కాకినాడ నుంచి ఏసీ బోగీ లతో ఒక ప్రత్యేక రైలును ఈ నెల 20న ప్రయాగ్ రాజ్‌కు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదనపు రైలు కోసం భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు మరో రైలు కూడా ఏర్పాటు చేశారు.
మద్యం షాపులకు
దరఖాస్తు గడువు పెంపు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 13 మద్యం షాపులకు దరఖాస్తు గడువును శనివారం సాయంత్రం 5 గంటల వరకూ పెంచినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 13 షాపులకు 17 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 9న దరఖాస్తుల పరిశీలిస్తామన్నారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం ఆర్‌డీవో కార్యాలయంలో షాపుల కేటాయింపునకు డ్రా తీస్తామని, అదే రోజు షాపులు కేటాయిస్తామని వివరించారు.
బీసీ హాస్టళ్లలో సంక్షేమం
అగమ్యగోచరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బీసీ హాస్టళ్లలో సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. అద్దె భవనాల్లోని హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారని, మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచుతామన్నారని, ఇవేవీ నెరవేరలేదని అన్నారు. బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం చెప్పినా అమలు చేయలేదన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో హాస్టళ్లను ఇన్‌చార్జి వార్డెన్లు నడుపుతున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. హాస్టళ్లలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
రేపు, ఎల్లుండి
నామినేషన్లకు సెలవు
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి శని, ఆదివారాల్లో నామినేషన్లు స్వీకరించబోమని రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
![పాఠశాల విద్యను పరిరక్షించాలి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06rjc203-270080_mr-1738867029-1.jpg)
పాఠశాల విద్యను పరిరక్షించాలి
Comments
Please login to add a commentAdd a comment