ముగిసిన ఆదివాసీ ఉత్సవాలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎస్‌ఎఫ్) జాతీయ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఆదివాసీల జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీల జీవన విధానాలు, ప్రభుత్వపరంగా అందుతున్న ప్రోత్సాహాల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. టీఎస్‌ఎఫ్ వ్యవస్థాపకుడు మల్లి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ఆ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కరంసి అక్కులప్ప నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి మూడవత్ విష్ణునాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రగతి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించి, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటి వరకూ ఆశించిన ప్రగతిని గిరిజనులు అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో గిరిజన విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మెటిక్ చార్జీలను ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన కుటుంబాలకు కూడా వర్తింపజేయాలన్నారు. మైదాన ప్రాంతంలోని గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర నాయక్, మహిళా అధ్యక్షురాలు మధులత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment