ఎన్నికలేనా..?
గన్నిపై గోరంట్ల వ్యతిరేకత!
రాజమహేంద్రవరం మేయర్ పదవిని టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆశిస్తున్నారు. ఈ నెలలోపు ఎన్నికలు జరిగితే ఆయనకు పదవి వరించే అవకాశం ఉంది. ఈ విషయమై ఇటీవల రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. ‘ఎన్నికలు త్వరగా నిర్వహించవచ్చు కదా.. అలా చేస్తే గన్ని కృష్ణ మేయర్ అయ్యే అవకాశం ఉంది కదా’ అని బుచ్చయ్య వద్ద పార్టీ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన గోరంట్ల.. ‘అందరూ పదవులు ఆశించడమేనా.. పార్టీ బలోపేతానికి ఏమైనా చేశారా?’ అని గన్ని కృష్ణను ఉద్దేశించి సైటెర్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిని బట్టి చూస్తూ గన్ని కృష్ణ అభ్యర్థిత్వాన్ని బుచ్చయ్య వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతోంది.
● రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలపై వీడని ప్రతిష్టంభన
● నెలాఖరులోగా జరపకపోతే
రిజర్వేషన్లు మారే చాన్స్
● ఆలోగా నిర్వహణ అసాధ్యమే..
● మేయర్ సీటుపై ఇప్పటికే ఓసీ నేతల కన్ను
● రిజర్వేషన్లు మారితే వారి ఆశలపై నీళ్లు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఎన్నికలు కలగానే మిగలనున్నాయా.. సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వ్యవహా ర శైలే దీనికి సాక్షిగా నిలుస్తోందా.. వీరిద్దరి విభేదాల తో మేయర్ పీఠం ఆశిస్తున్న వారికి జెల్ల తగలనుందా.. నెలాఖరులోగా ఎన్నికలు జరపకపోతే రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశాలున్నాయా.. అదే జరిగితే మేయర్ పీఠంపై కన్ను వేసిన ఓ సీనియర్ టీడీపీ నేత ఆశలు అడియాసలుగానే మిగలనున్నాయా.. ఇటువంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం
దేశవ్యాప్తంగానే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. ఆ సందర్భంగా పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తీర్థ విధులు నిర్వహించేందుకు కోట్లాదిగా భక్తులు రాజమహేంద్రవరం తరలివస్తారు. ఈ నేపథ్యంలో నగరంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు వందల కోట్ల రూపాయలు గోదావరి వరదలా వచ్చి పడతాయి. పుష్కరాల పనులు, ఏర్పాట్లు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ పనులు సవ్యంగా జరగాలంటే నగర పాలక సంస్థకు పాలకవర్గం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవల్‌మెంట్ అథారిటీ (రు డా) చైర్మన్ పోస్టును సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు సైతం నిర్వహిస్తామని పుర పాలక మంత్రి నారాయణ కాకినాడలో కొద్ది రోజుల కిందట జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. కానీ ఆ దిశగా నేటికీ అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. వెరసి ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. అనే మీమాంస నగర ప్రజల్లో నెలకొంది.
వారి మధ్య విభేదాలే అడ్డంకి!
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి అప్పారావు వర్గాల మధ్య కొన్నేళ్లుగా వర్గ విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాలే కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డంకిగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ఎన్నికలపై తలో వాదన వినిపిస్తున్నా రు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు 2012 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను నగరంలో విలీనం చేసే అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో, ఈ విలీనం లేడానే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని వాసు, గ్రామాల విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఇదే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారిందని చెబుతున్నారు.
రిజర్వేషన్ల తారుమారు?
నగర పాలక సంస్థ తొలి మేయర్ సీటును ఎస్సీ జనరల్‌కు కేటాయించగా దివంగత ఎంఎస్ చక్రవర్తి, రెండోసారి బీసీ మహిళకు కేటాయించగా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, మూడోసారి ఓసీ మహిళకు కేటాయించగా పంతం రజనీ శేషసాయి మేయర్లుగా వ్యవహరించారు. నగర మేయర్ స్థానాన్ని 2020లో రొటేషన్ పద్ధతిలో ఓసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లలో మార్పు ఉంటుంది. 2025 ఫిబ్రవరి నెలలో రిజర్వేషన్లు మారే ఆస్కారం ఉందని అధికార యంత్రాంగం వెల్లడిస్తోంది. ఇదే కనుక జరిగితే మేయర్‌తో పాటు కార్పొరేటర్ల రిజర్వేషన్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటాయి. రొటేషన్ ప్రకారం ఈసారి మేయర్ పీఠాన్ని ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారనే విషయం అంతు చిక్కని ప్రశ్నగా మారుతోంది. రోస్టర్ ప్రకారం బీసీ జనరల్ రిజర్వేషన్ మిగిలి ఉంది. అది జరిగితే మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న ఓసీ నేతలకు చుక్కెదురవడం ఖాయం. ఓసీ సామాజికవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ మేయర్ రేసులో ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆయన ఈసారి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ మార్పు అంశం తెర పైకి రావడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. రొటేషన్ ప్రకారం బీసీలకు కేటాయిస్తే మాత్రం ఇప్పటికే పదవి ఆశిస్తున్న జనసేన నేత అత్తి సత్తినారాయణకు గ్రీన్ సిగ్నల్ అందినట్లే. ఏది ఏమైనా ఈ నెలాఖరుకు ఎన్నికలు జరిగే అవకాశాలు మచ్చుకై నా కనిపించడం లేదు. దీంతో సీనియర్ నేత ఆశలు గల్లంతయ్యే సూచనలు దర్శనమిస్తున్నాయి.
రాజమహేంద్రవరం
కార్పొరేషన్
కార్యాలయం
పట్టుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నగరంలో మంచి పట్టుందని ఆయన వర్గీయులు చెబుతారు. విలీన గ్రామాలతో ఎన్నికలు జరిగితే తన వర్గం కార్పొరేటర్లతో సిటీలో చక్రం తిప్పవచ్చనే యోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి దండిగా నిధులు విడుదలయ్యే గోదావరి పుష్కరాల పనుల్లో సైతం తన హవా కొనసాగించవచ్చనే ఉద్దేశంతోనే గోరంట్ల విలీన ఎన్నికల వ్యూహం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు సిటీ ఎమ్మెల్యే వాసు ప్రస్తుతం నగరంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అన్నింటా ఆయన అనుచరులదే పెత్తనం. ఇసుక, మద్యం సిండికేట్లలో వారిదే పైచేయి. ఈ పరిస్థితుల్లో బుచ్చయ్య వర్గీయులు వస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందన్న భావనలో వాసు ఉన్నారని, అందువల్లనే ఆయన గ్రామాల విలీనం లేకుండా ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. గోరంట్ల, వాసు మధ్య విభేదాల విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. పరస్పరం సర్దుకుపోవాలని ఇద్దరినీ ఆయన ఆదేశించారు. అయినప్పటికీ అధినేత సూచనలను సైతం పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పుష్కరాల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఇతర పార్టీల అభ్యర్థులు కార్పొరేటర్లుగా నెగ్గితే.. వారి పెత్తనం ఎక్కడ భరించాల్సి వస్తుందోననే ఉద్దేశంతో కూడా ఎన్నికలు వాయిదా వేసేందుకే ఇష్టపడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment