ఇల అంతర్వేది పురములో..
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి/మలికిపురం: తూర్పున ఉవ్వెత్తున ఎగసే సాగర కెరటాల హోరు.. పశ్చిమాన వశిష్ఠ గోదావరి గలగలలు.. ఆ నడుమ సాగర సంగమ తీరంలో వెలసిన దేవదేవుడు.. ఆ లక్ష్మీ నారసింహుడు కొలువైన అంతర్వేది పుణ్యక్షేత్రం నిత్యం ఆధ్యాత్మిక పరవళ్లతో ఇల వెలసిన వైకుంఠంలా దర్శనమిస్తోంది. భక్తకోటి నడకలు ఆ పుణ్యక్షేత్రం దారుల్లోనే సాగుతున్నాయి. స్వామి వారి కల్యాణ ఘడియలు దగ్గరపడుతున్నకొద్దీ వారి నడకల్లో వడి పెరిగింది. వేదిక సర్వాంగ సుందరమై వధూవరుల రాకకోసం నిరీక్షిస్తోంది. తారా మండలం భువికొచ్చిందా అన్నట్టు విద్యుద్దీప కాంతులతో ఆ ప్రాంతమంతా శోభాయమానమై భాసిల్లుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే లక్ష్మీనరసింహుని కల్యాణం శుక్రవారం జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ‘ధరణిలో పుణ్యధామం, దర్శించిన ఎంతో భాగ్యం’ అని నమ్మే భక్తులు అంతర్వేదికి దారి తీస్తున్నారు. కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. తరువాత రోజయిన శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రథోత్సవం కన్నుల పండువగా సాగనుంది. కల్యాణం, తరువాత రోజు సముద్ర స్నానాలు, స్వామివారి దర్శనం, రథోత్సవం తదితర కార్యక్రమాలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. రాజోలు దీవిలో కొన్ని కుటుంబాల వారు ఈ కల్యాణంలో పాల్గొనడంతో పాటు కల్యాణాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుపతి ఘటన నేపథ్యంలో..
వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అంతర్వేదిలో నేడు
కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ వాహనంపై, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 12.55 గంటలకు స్వామివారి వార్షిక తిరు కల్యాణం నిర్వహించనున్నారు.
విద్యుద్దీప కాంతుల్లో
అంతర్వేది ఆలయం
భద్రతా చర్యలివీ..
ఇవీ హెల్ప్‌లైన్లు
కమాండ్ కంట్రోల్ : 08862–243500
పోలీసు డయల్ నంబర్ : 100
సఖినేటిపల్లి ఎస్సై : 9440796566
రాజోలు సీఐ : 9440796526
తహసీల్దార్ : 9849903893
వీఆర్వో : 9701835669
ఎంపీడీవో : 9491575915
అంతర్వేది కార్యదర్శి : 9493062920
డాక్టర్ యూనస్ : 8792257516
రాజోలు ఆర్టీసీ ఎంక్వయిరీ : 08862–221057
లక్ష్మీ నారసింహుని
కల్యాణానికి సర్వం సిద్ధం
నేటి రాత్రి 12.55 గంటలకు
దివ్య ముహూర్తం
రేపు మధ్యాహ్నం
2.05 గంటలకు రథోత్సవం
రెండు లక్షల మంది భక్తులు
వస్తారని అంచనా
ఉభయ గోదావరి జిల్లాల నుంచి
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
తిరుపతి ఘటన నేపథ్యంలో భారీ భద్రత
ఆలయ సమీపంలో పర్యాటక శాఖ అతిథి గృహం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌ను, బీచ్ వద్ద కూడా తొలిసారిగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
20 డ్రోన్‌లు, 100 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. భక్తుల కోసం రూట్ మ్యాప్ విడుదల చేశారు.
1,550 మంది పోలీసు సిబ్బందిని భద్రతకు వినియోగిస్తున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 1,400 మంది కానిస్టేబుల్స్, మరికొంత మంది హోంగార్డులు విధుల్లోకి రానున్నారు.
బీచ్‌వద్ద భక్తుల రక్షణకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో 4 రెస్క్యూ బోట్లు, 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు.
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వన్‌వే అమలు చేస్తున్నారు. వాహనాలను కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది పంపించనున్నారు. ఆలయం నుంచి వచ్చే వాహనాలు ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా వెళ్లాలి. భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ఆలయం వద్ద, రథం షెడ్డు వద్ద పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాలలో 340 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. 120 మొబైల్ టాయిలెట్లు, 5 వైద్య శిబిరాలు, మూడు 108 వాహనాలు, 104 వాహనాలు అందుబాటులో ఉంచారు. 26 మంది వైద్యాధికారులు, 85 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నారు.
ఆర్టీసీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం, పాలకొల్లు నుంచి 40, కోనసీమ జిల్లా అమలాపురం, రాజోలు నుంచి 65 ప్రత్యేక బస్సులు భక్తుల కోసం నడపనుంది.
కల్యాణం రోజున సాధారణ భక్తులు స్వామి కల్యాణాన్ని వీక్షించేలా 12 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment