సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మానవ రవాణా, వెట్టిచాకిరీ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు చేసుకోగా సుమారు రూ.60 లక్షల నష్టపరిహారం అందజేశారన్నారు. ప్రజలకు పథకాలు, చట్టాలపై అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం హక్కులతో పాటు కొన్ని విధులు కూడా నిర్దేశించిందన్నారు. బాలబాలికలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని, వారు తప్పనిసరిగా చదువుకునే విధంగా చట్టాలు ఉన్నాయని సునీత చెప్పారు. కార్మిక శాఖ సహాయ కార్మిక కమిషనర్ బీఎస్‌ఎం వలీ మాట్లాడుతూ, సమాజంలో వెట్టి చాకిరీ కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కార్మిక చట్టాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు, గిరిజన సంక్షేమ అధికారులు కె.విజయకుమారి, కేఎన్ జ్యోతి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.షర్మిలా అశోక తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా.. వెట్టిచాకిరీ కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment