పబ్లిక్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సమన్వయ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 43,754 మంది ఇంటర్ విద్యార్థులకు 51 పరీక్షా కేంద్రాలు, 25,723 మంది టెన్త్ విద్యార్థులకు 134 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందుగానే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం మాట్లాడుతూ, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 20,591 మంది, రెండో సంవత్సరం 19,062 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 2,226 మంది, రెండో సంవత్సరం 1,875 మంది హాజరు కానున్నారని వివరించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్‌ఐవో కార్యాలయంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 0883–2473430 నంబర్‌తో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఐదు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్‌గా 24,763 మంది (బాలురు 12,791, బాలికలు 11,972), ప్రైవేటుగా 960 మంది (బాలురు 591, బాలికలు 369) హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మురళీకృష్ణ, డీఆర్వో టి.సీతారామమూర్తి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా ఒకేషనల్ అధికారి జీవీఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ప్రశాంతి
ఫ అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment