చంద్రబాబు నిర్ణయం.. వైద్య విద్యకు శాపం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్ణయం.. వైద్య విద్యకు శాపం

Published Fri, Jan 31 2025 2:20 AM | Last Updated on Fri, Jan 31 2025 2:20 AM

చంద్రబాబు నిర్ణయం.. వైద్య విద్యకు శాపం

చంద్రబాబు నిర్ణయం.. వైద్య విద్యకు శాపం

11 వైద్య కళాశాలల మూసివేతకు జీఓ

2,450 సీట్లు కోల్పోనున్న ఏపీ విద్యార్థులు

సీపీఐ జిల్లా కార్యదర్శి మధు

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించలేమంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్య దూరం కానుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించలేమంటూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసిందని, తద్వారా ఈ విద్యా సంవత్సరంలో 700 సీట్లు రద్దయ్యేలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. 2022 నాటికి రాష్ట్రంలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలుండగా.. 2023లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిందని గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్‌ నాటికి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కళాశాలలు ప్రారంభించారన్నారు. 2024 నాటికి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా.. పాడేరులో కేవలం 50 సీట్లతో ప్రారంభించి, మిగిలిన చోట్ల వైద్య కళాశాలలు అవసరం లేదంటూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ప్రభుత్వం లేఖ రాయడం సరికాదని మధు అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుగొండ వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇలా ప్రారంభం కాని మొత్తం 11 కళాశాలలను మూసివేయడానికి కూటమి ప్రభుత్వం జీఓ 27 జారీ చేసి, కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కళాశాలలను ప్రారంభించనందు వలన ఏపీ విద్యార్థులు 2,450 మెడికల్‌ సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలలనే మూసివేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేసి, మెడికల్‌ సీట్లు వచ్చేలా ప్రయత్నం చేయాలని, లేకుంటే ఆందోళన చేపడతామని మధు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement