మానవాభివృద్ధి సూచీలో ఎప్పటిలా మనం వెనకబడే వున్నాం. విద్య, వైద్యం, ఆయుర్దాయం వంటి చాలా అంశాల్లో నాసిరకం ప్రమాణాలతోనే నెట్టుకొస్తున్నాం. ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) విడుదల చేసే మానవాభివృద్ధి సూచీ నివేదిక ఏ దేశం సాధించినదెంతో చెబుతుంది. నిరుడు విడుదల చేసిన నివేదికలో అంతక్రితంకన్నా మెరుగై 129వ స్థానంలోకొచ్చిన మన దేశం ఈసారి మాత్రం రెండు మెట్లు కిందకు దిగి 131 స్థానానికి పోయింది. లోగడ 134వ స్థానంలో వున్న భూటాన్ వివిధ అంశాల్లోనూ తనను తాను మెరుగుపర్చుకుని ఇప్పుడు 129వ స్థానానికొచ్చింది. వాస్తవానికి ఈ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించి వివిధ దేశాల ప్రగతిని పరిగణనలోకి తీసుకుంది. అది ముగిసి 2020లోకి అడుగుపెట్టాక కరోనా మహమ్మారి కాటేసింది గనుక మనతోపాటు దాదాపు అన్ని దేశాలూ ఇందులో పొందిన ర్యాంకులకన్నా ప్రస్తుతం ఇంకా కిందకు దిగజారివుంటాయి. అయితే మన దేశం అన్ని ప్రమాణాల్లోనూ ఒకే రకంగా అట్టడుగు స్థాయిలో లేదు. కొన్నింటిలో మెరుగ్గా వుండగా, మరికొన్ని అంశాల్లో చాలా వెనకబడి వుంది. తాజా నివేదిక ప్రకారం మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుంది. ఈ విషయంలో మనకన్నా బంగ్లాదేశ్(72.6), నేపాల్(70.8), భూటాన్(71.8) ఎంతో మెరుగ్గా వున్నాయి. అలాగే స్థూల జాతీయ తలసరి ఆదాయంలోనూ 2018తో పోలిస్తే నిరుడు తగ్గింది. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ.
ప్రగతికి కొలమానంగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని చెప్పడం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నిటా అలవాటుగా మారింది. జీడీపీ శాతాన్ని చూపుతూ అంతా సవ్యంగా వుందని మన పాలకులు కూడా నమ్మిస్తూనే వున్నారు. కానీ సాధారణ ప్రజలకు విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల కల్పన ఎలావుందో, దేనికెంత వ్యయం చేస్తున్నారో లెక్కలు తీస్తే ఎప్పుడూ మనం దిగ దుడుపే. వాస్తవంగా సాధారణ ప్రజల తలసరి ఆదాయం ఎలావుంది... ఆ ఆదాయంలో వారు విద్య, వైద్యం, చదువు వగైరా అంశాల్లో ఎలా ఖర్చు చేస్తున్నారన్నదే కీలకమైన విషయం. అలాగే సామాజికంగా మహిళలు ఏ స్థానంలో వున్నారో, వారి అధీనంలో వున్న ఆస్తుల సగటువిలువెంతో, పాలనా వ్యవస్థలో వారికిస్తున్న స్థానం ఏపాటిదో పరిగణనలోకి తీసుకుంటేనే వాస్తవ అభివృద్ధి ఎలావుందో తెలుస్తుంది. దేశాన్నేలే పాలకులు వేటిని ప్రాధాన్యతా అంశాలుగా చూస్తున్నారో, వారి విధానాలు పౌరుల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో, భిన్న రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధేమిటో చూడటమే మానవాభివృద్ధి సూచీ లక్ష్యం. ఆరోగ్య సదుపాయాల సంగతే చూస్తే కొన్ని వెనకబడిన దేశాలకన్నా మనం నాసిరకంగా వున్నాం. పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, మన దగ్గర అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్‌లో 6. ఇక వైద్యుల లభ్యత చూసినా అంతే.
పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్‌లో ఆ సంఖ్య 9.8. చిత్రమేమంటే వైద్యుల లభ్యతలో మనకన్నా స్వల్పంగా వెనకబడి 8.3 దగ్గరే ఆగిన చిన్న దేశం వియత్నాంలో బెడ్ల సంఖ్యమాత్రం ఎక్కువ. అక్కడ పదివేల జనాభాకు సగటున 32 వున్నాయి. మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో మనం చాలా వెనకబడివున్నామని కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడినప్పుడు తేటతెల్లమయింది. వైద్య విద్యకు అగ్ర ప్రాధాన్య మిచ్చి కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వాలు భావించకపోవడమే ఇందుకు కారణం. ఉన్న కళాశాలల్లో అవకాశాలు రాక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వగైరా దేశాలకు వలసపోవలసి వస్తోంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ స్థాయిల్లో సీట్ల సంఖ్య మరీ తక్కువ. పైగా వైద్య విద్య ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రైవేటు రంగంలోని కళాశాలలు, డీమ్డ్ యూని వర్సిటీల్లో 50 శాతం సీట్లకు ఇష్టానుసారం ఫీజుల్ని వసూలు చేసుకునే అవకాశం ఇవ్వడంతో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. పరిస్థితి ఇలా వున్నప్పుడు వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి?
ఆయుర్దాయం, ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణం వగైరా అంశాలకు విడివిడిగా సూచీలు రూపొందించి మొత్తం మానవాభివృద్ధి సూచీలో ఏ దేశం ఎలావున్నదో చెప్పడం నివేదిక ఉద్దేశం. సున్నా నుంచి ఒకటి వరకూ మొత్తంగా ఏ దేశం ఏ స్థానంలో వుందో అది వెల్లడిస్తుంది. అలా చూసుకుంటే తొలి స్థానంలో వున్న నార్వే కూడా పూర్తిగా ఒకటికి చేరలేకపోయింది. అది 0.957 దగ్గర వుంది. రెండో స్థానంలో వున్న ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌లు 0.955 దగ్గర వున్నాయి. మనం 0.645 దగ్గర, శ్రీలంక 0.782 దగ్గర వున్నాయి. మానవాభివృద్ధి సూచీ అద్దంలాంటిది. అది మనం ఎలావున్నామో చెబుతుంది. దాన్ని చూసి సరిచేసుకోవడం మన బాధ్యత. జీడీపీ ఘనంగా కనబడినా, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పుకున్నా సాధారణ పౌరులకు ఒరిగేదేమీ వుండదు.
వ్యవ సాయం, పరిశ్రమలు, సేవారంగం తదితరాల్లో మొత్తం ఉత్పత్తుల విలువ(జీఎన్‌డీపీ)ని లెక్కగట్టి, జనాభా సంఖ్యతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కేస్తారు. ఇందులో ప్రభుత్వోద్యోగులకు లభించే జీతాలు కూడా వచ్చి చేరతాయి. ఇలావచ్చే జీడీపీని చూసి దారిద్య్రం తగ్గిందని, దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని భావించడం పనికిమాలిన వ్యవహారమని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకు బదులు విద్యను, వైద్యాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను ఏమేరకు కల్పించామో ప్రభు త్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సాధారణ ప్రజానీకం ఆదాయాన్ని పెంచడానికి, వారు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సూచీలో గర్వపడదగిన స్థాయికి చేరుకోగలుగుతాం.
Comments
Please login to add a commentAdd a comment