తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి స్వల్ప వ్యవధిలోనే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ అందుకు వేదికైంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో సభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సభా సంప్రదాయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని ఆయన చదవాల్సివుండగా అందులోని కొన్ని వాక్యాలనూ, పదాలనూ ఆయన విడిచి పెట్టారు. పైగా కొన్నింటిని సొంతంగా చేర్చారు. దాంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గవర్నర్ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి తీర్మానాలు ప్రవేశపెట్టడం, సభ వాటిని ఆమోదించటం అయి పోయింది. ఆ దశలో రవి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించారు.
తమిళనాట ద్రవిడ ఉద్యమ ప్రభావం ఇప్పటికీ ఎంత బలంగా ఉన్నదో అందరికీ తెలుసు. కేరళ క్యాడర్ ఐపీఎస్ మాజీ అధికారి అయిన రవికి దీనిపై పూర్తి అవగాహన ఉంటుందనటంలో సందేహం లేదు. మరి ‘ద్రవిడ మోడల్ ప్రభుత్వం’ ప్రస్తావన, పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి తమిళ దిగ్గజాలతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రస్తావన సైతం రవికి ఎందుకు రుచించలేదో అనూహ్యం. ఒక పౌరుడిగా ఈ దిగ్గజాలపైనా, మొత్తంగా ద్రవిడ ఉద్యమంపైనా రవికి సొంతా భిప్రాయాలేవో ఉండివుండొచ్చు. అంతమాత్రాన తనకిచ్చిన ప్రసంగపాఠంలో ఆ ప్రస్తావనలను మినహాయించటం హర్షించదగ్గదికాదు.
అసలు తమిళనాడు అనటంపైనే ఆయనకు అభ్యంతరం ఉన్నట్టుంది. ఈమధ్య రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ‘తమిళనాడు’కు బదులు ‘తమిళగం’ అని అన్నారు. ఆ వెంటనే దానిపై పెద్ద వివాదం రాజుకుంది. ‘నాడు’ అంటే సార్వభౌమాధికారం ఉండే ఒక రాజ్యంగా ధ్వనిస్తూ వేర్పాటువాద భావన కలగజేస్తున్నదని రవి అభిప్రాయంగా కనబడుతోంది. తమిళ సాహితీవేత్తల వివరణ ప్రకారం ‘నాడు’ అంటే ‘గడ్డ’, ‘ప్రాంతం’ అనే తప్ప వేరే అర్థం లేదు. అసలు తమిళనాడు అనే పేరు రాజ్యాంగానికి అనుగుణ మైనదైనప్పుడు దానిపై పట్టింపులకు పోవటం సరైంది కాదు. అదింకా సద్దుమణగక మునుపే తాజా వివాదం తలెత్తింది.
మన ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై వివాదాలు చెలరేగడం ఇది మొదటిసారి కాదు... చివరిసారి కూడా కాకపోవచ్చు. నిజానికి అలాంటి సందర్భాల్లో తప్ప గవర్నర్ల వ్యవస్థపైనా, దాని అవసరంపైనా ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఎన్నో వ్యవస్థలపై చర్చలు సాగాయి. కొన్నింటి రూపురేఖలు కూడా మారాయి. కానీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులూ తమముందుకొచ్చే కేసుల విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, నిర్దేశించిన మార్గదర్శకాల పర్యవసానంగా ఏదోమేరకు మారింది తప్ప మొత్తంగా గవర్నర్ల వ్యవస్థ మునుపటి కాలంలో ఉన్నట్టే మిగిలిపోయింది. అందుకే సమస్యలు తప్పడం లేదు.
అత్యంత ప్రజాస్వామ్య వాదిగా ముద్రపడిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూయే గవర్నర్ల వ్యవస్థపై తొలి మరక పడటానికి, ఫెడరల్ వ్యవస్థ మనుగడపై సందేహాలు ముసురుకోవటానికి కారకుడు కావటం ఒక వైచిత్రి. ఆనాటి కేరళ గవర్నర్ ద్వారా తనకు కావలసిన నివేదిక తెప్పించుకుని రాజ్యాంగంలోని 356 అధికరణ కింద 1959లో నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని సాగనంపేవరకూ నెహ్రూ విశ్రమించలేదు.
అనంతరకాలంలో ప్రధాని అయిన ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రికార్డు స్థాయిలో 50 సార్లు ఆ అధికరణాన్ని ఉపయోగించుకుని తనకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. అటు తర్వాత వచ్చిన సంకీర్ణ రాజకీయ యుగంలో దాన్ని పెద్దగా ఎవరూ ఉపయోగించ లేదు. విపక్ష ఏలుబడిలో ఉంటున్న రాష్ట్రాల్లో గవర్నర్లకూ, సీఎంలకూ వివాదం ఏర్పడే ధోరణి తరచు కనబడటం మాత్రం వాస్తవం. అలాగని అన్నిచోట్లా అలా లేదు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బిహార్ గవర్నర్‌గా ఉన్నకాలంలో అప్పటికి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ ముఖ్య మంత్రిగా ఉన్నా ఆ ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రాలేదు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా గవర్నర్‌గా పనిచేసినప్పుడు పెద్దగా వివాదాల్లోకెక్కలేదు. కానీ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, తెలంగాణ గవర్నర్ తమిళసైలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో పొరపొచ్చాలు ఎడతెగకుండా సాగు తూనే ఉన్నాయి.
తమిళనాడు గవర్నర్ తన వ్యవహారశైలితో ఏం చెప్పదల్చుకున్నారో అర్థంకాదు. ఆయన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ప్రోత్సాహంతోనే ఇలా చేస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపించటం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. పైగా తమిళనాట నీరాజ నాలందుకునే పెరియార్, అన్నాదురైల పేర్లూ...అన్నిటికీ మించి అంబేడ్కర్ వంటి మహనీయుడి ప్రస్తావన ససేమిరా సమ్మతం కాదని పరోక్షంగా తెలియజెప్పటం ఏమేరకు సబబో రవి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ, అక్కడ గవర్నర్‌గా నియమితులైనవారికీ మధ్య ఆధిపత్య పోరు ఎడతెగకుండా సాగటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం కలగజేస్తుంది. ఇలాంటి వివాదాలు చెలరేగినప్పుడల్లా పరస్పరం విమర్శలు చేసుకోవటం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తటం, ఆ తర్వాత మరో కొత్త తగువు బయల్దేరేవరకూ మౌనం వహించటం కాక... గవర్నర్ల అధికారాలు, వారి పరిధులు, పరిమితులపై సరైన దిశగా చర్చ జరిగి వర్తమాన కాలానికి అనుగుణమైన విధానం రూపుదిద్దుకోవటం శ్రేయస్కరం.
Comments
Please login to add a commentAdd a comment