
అడ్డదారులు తొక్కి అధర్మ మార్గాన్నెంచుకొని ఏదో సాధించాలనుకోవడం ఎప్పుడూ ప్రమాదకరమే. తాత్కాలిక ఫలితాలు సిద్ధిస్తాయేమో గానీ అంతిమంగా పతనం తప్పదనే నీతి సారాన్ని మన ఇతిహాస కథలు బోధిస్తున్నాయి. అహల్యను చెరచడానికి దేవేంద్రుడు ఆమె భర్త గౌతముని వేషం దాల్చి మోసగిస్తాడు. చివరికి గౌతముని శాపానికి గురై కురూపిగా చిరకాలం బతకవలసి వచ్చింది.
రావణాసురుడు సీతమ్మవారిని అపహరించడానికి వీలుగా మారీచుడు బంగారు జింకలా మారి రామలక్ష్మణులను ఏమార్చుతాడు. ఒంటరిగా ఉన్న సీతమ్మను మారువేషంలో వచ్చిన రావణుడు అపహరిస్తాడు. కానీ, అజేయుడని పేరున్న రావణాసురుడు అంతిమంగా రామ బాణానికి నేలకూలక తప్పలేదు. మహాభారతంలోని మాయా జూద ఘట్టంతో సహా మనకు ఇటువంటి వృత్తాంతాలెన్నో ఉన్నాయి.
ఇతిహాస మోసాలకు మరింత పదును పెట్టిన వాడు ఆధునిక యుగంలో గోబెల్స్. హిట్లర్ దగ్గర ప్రపగాండా మంత్రిగా పనిచేసిన గోబెల్స్, దుష్ప్రచారాలకు పర్యాయ పదంగా మిగిలిపోయాడు. అతని ప్రచారాల అండతో చెలరేగి పోయిన హిట్లర్ కనీవినీ ఎరుగని మారణకాండకు కారకు డయ్యాడు. చివరికి ప్రాణ భయంతో కలుగులో దాక్కొని కుక్కచావు చచ్చాడు.
గోబెల్స్ ప్రపగాండా చాతుర్యానికి మరిన్ని కుయుక్తులు చేర్చి ఒక అధునాతన వంచనా శిల్పాన్ని చెక్కిన అపఖ్యాతి మన తెలుగువారైన చంద్రబాబుకూ, ఆయన భాగస్వాములైన యెల్లో మీడియాకూ సంయుక్తంగా దక్కుతుంది. తెలుగువారి ఘనకీర్తిని అంతర్జాతీయ యవనికపై ఎగరేసిన మహానుభావులెందరో మనకున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఇటువంటి అపకీర్తి కలుపుమొక్కలు కూడా కొన్ని మొలకెత్తడం ఒక విషాదం.
ఇప్పుడు చంద్రబాబు సహా యెల్లో కూటమి సభ్యులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. జీవన్మరణ సమస్య ఒక కరవాలం మాదిరిగా వారి మెడపై వేలాడుతున్నది. అధికారంలో ఉన్నప్పుడు వీరూ, వీరి అనుయాయులు వేల కోట్ల రూపాయ లను అమరావతి జూదంలో ఫణంగా ఒడ్డారు. రైతుల నుంచి భూసమీకరణ చేయడమనేది బూటకమనీ, ఇందులో అత్యధిక శాతం భూమిని చంద్రబాబు కూటమి సభ్యులే కొనుగోలు చేసి రైతుల పేరు మీద సమీకరణకు ఇచ్చారనే వాస్తవాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి.
అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో చేసిన ప్రహసనంలో ఆధార్ కార్డులు చూపెట్టి పాల్గొనడానికి అరవై మంది కూడా ముందుకు రాకపోవడంతో ఈ అభిప్రాయానికి బలం చేకూరింది. ప్రైవేట్ అంచనాల ప్రకారం యెల్లో కోటరీ సభ్యులు సోకాల్డ్ భూసమీకరణ మీద పదిహేను వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం వారు అను కున్నట్లు కొనసాగి వుంటే ఇంతకు పదింతలు సంపాదించవచ్చనే ఆశతో వారీ సమీకరణ తంతును జరిపించారు.
అచ్చం రియల్ ఎస్టేట్ కంపెనీవాళ్లు విడుదల చేసినట్టే ప్రింటెడ్, డిజిటల్ గ్రాఫిక్ బ్రోచర్లను స్వయానా చంద్రబాబునాయుడే విడుదల చేసిన వైనం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ వెంచర్‌లో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు యెల్లో ముఠా ఎంత అల్లకల్లోలం చేసిందో కూడా గుర్తుండే ఉంటుంది. కోర్టు మెట్లెక్కి మరీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
నోటిదాకా వచ్చిన లక్షన్నర కోట్ల కేపిటల్ లడ్డూ అందకుండా పోతున్నదని ఈ ముఠా కుమిలి కుమిలి కునారిల్లు తున్నది. శాసన రాజధాని అక్కడే కొనసాగుతుందనీ, పాలనా, న్యాయ రాజధానులను మాత్రమే తరలిస్తామనీ ప్రభుత్వం చెప్పే సమాధానం ససేమిరా మింగుడుపడడం లేదు. అదిగో సచివాలయం, అల్లదిగో అసెంబ్లీ, అటు చూడు హైకోర్టు అని వెంచర్‌ను ప్రచారం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో చిక్కుకున్నామని ఆందోళనపడుతున్నారు.
చంద్రబాబు విడుదల చేసిన బ్రోచర్లను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. కృష్ణానది చీలి అమరావతి నగరం మధ్యలో పారుతున్నట్టు ఒక కల. ఒక కలర్ పిక్చర్. వెనిస్ నగరానికి అమ్మలాగా నగరం మధ్యలో పడవ ప్రయాణం.
తాజ్‌మహల్ అమ్మమ్మ లాంటి కట్టడాలు, వీలైతే పారిస్‌లో ఉన్న ఐఫిల్ టవర్‌ను కొనుగోలు చేసి మన మందడం పక్కన పాతించడం... ఈ రకమైన సెట్టింగ్స్ వేయడమెలాగో తెలుసుకోవడానికి రాజమౌళితో కూడా చంద్రబాబు సంప్రదింపులు సాగించిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రచారానికి ప్లాన్ చేసుకున్న వారికి ఒక్క అసెంబ్లీ ఏం సరిపోతుంది?
భూముల విక్రయాల ద్వారా ఆశించిన లక్షన్నర కోట్లే కాదు... ఆ తర్వాత డెవలప్‌మెంట్ పేరుతో అంతకు రెట్టింపు ఆర్జించే ప్రణాళికను బాబు, ఆయన కోటరీ తయారుచేసుకున్నది. ఇప్పుడా కలలన్నీ కల్లలుగా మారే పరిస్థితి ఎదురుకావడంతో, పెట్టిన పదిహేను వేల కోట్ల పరిస్థితేమిటని బాబు, ఆయన భాగస్వాములు వణికి పోతున్నారు.
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే, ఏదో మేరకు డ్యామేజి కంట్రోల్ జరగాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచితీరాలి. సాధ్యమేనా? అసాధ్యమనే సంగతి తెలియనంత అమాయకుడు కాదు చంద్రబాబు. జాతీయ స్థాయిలో ప్రతిష్ట గలిగిన ఒక సర్వే సంస్థ ఒక జాతీయ పార్టీకోసం రాష్ట్రాల వారీగా చేసిన అభిప్రాయ సేకరణ ద్వారా ఈ సంగతి రూఢీ అయింది.
తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఇరవై శాతానికి పైగా ఎక్కువ మద్దతున్నట్టు వెల్లడైంది. గడిచిన ఎన్నికల్లో ఈ తేడా పదిశాతం మాత్రమే. ఇప్పుడు వైసీపీ మద్దతు గతంతో పోలిస్తే రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే పెరిగినప్పటికీ తెలుగుదేశం మద్దతు దాదాపుగా పదిశాతం పడిపోయింది. రెండు పార్టీల మధ్యన ఉన్న ఈ అగాధాన్ని దాటాలంటే హనుమంతుని మాదిరిగా లంఘించే పవన విహార విద్య తెలిసి ఉండాలి.
గత ఎన్నికల్లో వైసీపీకి యాభై శాతానికి పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఓట్లు తక్కువైనప్పటికీ నూటా యాభయ్యొక్క సీట్లొచ్చాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం యాభై నాలుగు శాతం ఓట్లు వస్తే ఎన్ని సీట్లు రావాలి? ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం నెగ్గుకురావాలంటే ఏం చేయాలి? హనుమంతుడిలా అగాధ లంఘన విద్యను ఎలా అభ్యసించాలి? చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ శిరోభారం నుంచి బయటపడేందుకు చాలాకాలం కిందటే తెలుగుదేశం పార్టీ డబుల్ యాక్షన్ విక్స్‌వేపోరబ్ వంటి ఒక ద్విముఖ వ్యూహాన్ని రంగంలోకి తెచ్చింది.
ఈ డబుల్ యాక్షన్‌లో ఒకటి మనీ గేమ్, రెండు మైండ్ గేమ్! నాన్–వైసీపీ పార్టీలు, సంస్థ లన్నింటినీ తన నాయకత్వంలో ఒక్క తాటిపైకి తేవాలి. ఇందు కోసం అవసరమైతే మనీ గేమ్‌కు రెడీ! అధికారం వస్తే ఓ రెండు లక్షల కోట్లను (అమరావతి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా) కొల్లగొట్టే అవకాశం ఉన్నప్పుడు అందులో రెండు శాతమో మూడు శాతమో వెదజల్లితే మాత్రం నష్టమేమిటన్న నిర్ధారణకు యెల్లో కూటమి వచ్చేసినట్టు కనిపిస్తున్నది.
ఇక వైసీపీకి జనంలో ఉన్న మద్దతును గణనీయంగా తగ్గించాలి. ఇందుకోసం మైండ్ గేమ్. దీనికి గోబెల్స్ ప్రచారమే ప్రాతిపదిక. కాకపోతే దానికంటే వెయ్యి గిగాబైట్ల సామర్థ్యమెక్కువ. దీన్ని ఆధారం చేసుకొని జనం మెదళ్లతో గేమ్ ఆడటం. వైసీపీ బలం క్షీణించిందనే అభిప్రాయాన్ని జొప్పించడం. ఇందుకోసం ఉపయోగపడే ఒక సందర్భాన్ని వాడుకోవడానికి చాలాకాలం క్రితమే ఆ పార్టీ ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నది.
టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలను శాసనమండలికి జరిగే ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం చాలా అరుదు. ఎప్పుడైనా ఒకటీ అరా సందర్భాల్లో ప్రతిష్టకు పోయి, డబ్బులు వెదజల్లి విపక్షాలను చీల్చినప్పుడు స్వల్ప తేడాతో గెలవడం జరిగేదేమో. అది కూడా ఒకటి రెండు సందర్భాలకు మించి లేవు. ఈ ఓటర్లలో వామపక్షాలకు ఆది నుంచి బలం ఎక్కువ. ఆ తర్వాతి స్థానం బీజేపీది.
గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు ఓటర్లుగా ఉంటారు. సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరూ స్వచ్ఛందంగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవడానికి ఉత్సాహం చూపరు. ఈ పనిని ఎవరో ఒకరు చేసిపెట్టాల్సిందే. వామపక్షాలు, బీజేపీ కార్యకర్తలు ఈ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. పైగా ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, బ్యాంకు ఉద్యోగుల సంఘాల్లోనూ వామపక్షాల పలుకుబడి మొదటినుంచీ ఉన్నది.
ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు, రాయలసీమలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలపై చాలాకాలం క్రితమే టీడీపీ కన్నేసింది. వామపక్ష ఓట్లు, బీజేపీ ఓట్లు తన పార్టీ అభ్యర్థులకు ఎక్కువగా పోలయ్యేలా రహస్య మంత్రాంగం చేసింది. రంగంలో లేని జనసేన ఓట్లు స్వల్పమే అయినా టీడీపీ ఖాతాలో వేసుకున్నది.
బీజేపీ, వామపక్షాల ఓట్లు గణనీయంగా టీడీపీకి బదిలీ అయిన ట్రెండ్ లెక్కింపులో కనిపించింది. పశ్చిమ రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పోటీచేసిన ఇండిపెండెంట్ గెలిచారు. ఈసారి ఆయన వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకే ఆధిక్యత లభించింది.
యాభై శాతం ఓట్ల మార్కుకోసం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించినప్పుడు టీడీపీ అభ్యర్థి గెలుపొందాడు. మొదటి ప్రాధాన్యతలో పీడీఎఫ్ (లెఫ్ట్), బీజేపీలకు ఓట్లేసినవారు గంపగుత్తగా రెండో ప్రాధాన్యతలో టీడీపీకి వేశారు. టీడీపీ చేసిన రహస్య మంత్రాంగానికి స్పష్టమైన ఉదాహరణ ఇది.
ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో పీడీఎఫ్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగి స్వల్ప తేడాతో బీజేపీ గెలిచింది. ఈసారి వారి ఓట్లు తగ్గి టీడీపీ అభ్యర్థి గెలిచారు. తూర్పు రాయలసీమలో ఇంతకుముందు పీడీఎఫ్ గెలిచింది. ఇప్పుడు టీడీపీ గెలిచింది. ఇక్కడా అదే పరిస్థితి. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. దానికి మీడియాలో సరైన ప్రాధాన్యత లభించలేదు.
ఒక గాలిని పోగేయడం, ఒక మూడ్‌ను సృష్టించడం కోసం తెలుగుదేశం, యెల్లో మీడియా సర్వశక్తులు ఒడ్డి ఫోకస్ పెట్టాయి. గత కొంత కాలంగా ఉద్యోగుల మనసుల్లో యెల్లో మీడియా నాటుతున్న ప్రభుత్వ వ్యతిరేక విషబీజాల ప్రభావం కూడా ఎంతోకొంత ఉండవచ్చు. ఇంతా చేస్తే మొత్తం పోలయిన ఓటల్లో వైసీపీ అభ్యర్థులకంటే టీడీపీకి వచ్చిన ఓట్లు కేవలం ఆరేడు శాతమే ఎక్కువ.
బౌన్సీ పిచ్‌పై బ్యాటింగ్ చేసిన జట్టు చాలా గౌరవప్రదమైన స్కోరు చేసినట్టే వైసీపీ ఫలితాన్ని పరిగణించాల్సి ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ఈ స్థాయి ప్రభావాన్ని చూపలేదు. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలను గెలుచుకోలేదు. ఇదీ వాస్తవికత. కానీ తెలుగుదేశం యెల్లో మీడియా ప్రభుత్వ వ్యతిరేక పవనం వీస్తున్నదని ప్రచారంలో పెట్టింది. దీన్నే మైండ్ గేమ్ అంటారు.
ఎమ్మెల్యేలు ఓటేసే ఎమ్మెల్సీ సీట్లలో ఏడుకు గాను ఒక సీటును టీడీపీ గెలిచింది. విలువలను దిగజార్చడం ఇష్టంలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వదిలేసుకున్న సీటు అది. వదిలేసిన సీటును గెలిచి ఎమ్మెల్యేలలోనూ ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం వీస్తున్నదని డప్పేయడం మొదలుపెట్టారు. చచ్చి పడి ఉన్న ఓ పెద్దపులి గోళ్లను కత్తిరించుకొచ్చి పులిని చంపింది నేనే అన్నాడట పూర్వం ఒకడు.
ఇప్పుడు కూడా ఒకాయన రోజూ అంటూనే ఉంటాడు... సెల్‌ఫోన్ నాదే, కంప్యూటర్ నాదే, టీవీ నాదే, కెమెరా నాదే, హైదరాబాద్ నాదే, బాగ్దాద్ నాదే, దావోస్ నాదే, ఇస్తాంబుల్ నాదే, సింగపూర్ నాదే... ఈరకమైన వ్యవహార శైలికి ఏం పేరు పెట్టాలి? సామాన్య జనుల సాధికారత కోసం, జనాభాలో సగమైన అక్కచెల్లెమ్మలకు సముచిత స్థానంకోసం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రజాస్వామిక విప్లవం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గోబెల్స్ ప్రచారాలతో, మైండ్ గేమ్‌లతో, మనీ గేమ్‌లతో ఓడించగలమని భావిస్తే... అది అహంభావమైనా కావాలి... ఉన్మాదమైనా కావాలి.
ఈ రెండూ జత కలిసి ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో జమిలి నాట్యం చేస్తున్నవి. ఒకడు మీడియాను మాఫియాగా మార్చిన ప్రబుద్ధుడు. అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్నా మాయో పాయాలతో న్యాయవ్యవస్థ కళ్లు కప్పుతున్నవాడు. మార్గదర్శి వ్యవహారంలో నేర నిర్ధారణ జరిగి కటకటాల వెనక్కి వెళ్ల వలసినవాడు. మరొకడు రాజకీయ నేత. రాజకీయాన్ని జూదంగా మార్చినవాడు.
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నవాడు. సవాలక్ష అవినీతి పనులకు కేరాఫ్ అడ్రస్. ఎత్తులతో, జిత్తులతో న్యాయ సమీక్షకు దూరం జరుగుతున్నవాడు. పాపాలు పండుతున్నాయి. ఒక్కొక్క స్కామ్ సాక్ష్యాధారాలతో బద్దలవు తున్నది. నేడో రేపో జైలు ఊచలు లెక్కపెట్టవలసినవాడు.
ఇద్దరూ కలిసి ఆంధ్రదేశం కళ్లకు ఇంకెంతకాలం గంతలు కట్టాలి? ఓ అఖిలాంధ్ర మేధావులారా వీరి చట్టవిరుద్ధ చర్యలను ప్రశ్నించరెందుకని? నిజం నిద్ర లేవకముందే అబద్ధాలతో, అభూతకల్పనలతో ప్రభాత భేరీలు మోగిస్తున్న ఆషాఢభూతుల కదలికలపై కన్నేయవలసిన అవసరం లేదా? పేద ప్రజల మేలుకోసం, సామాన్య ప్రజల శ్రేయస్సుకోసం సాగుతున్న యజ్ఞాన్ని తమ స్వార్థంకోసం, సొంత వర్గ ప్రయోజనాల కోసం భగ్నం చేయజూస్తున్న యెల్లో ముఠాను ఎలుగెత్తి ఖండించడం నేటి కర్తవ్యం కాదా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment