ఆ పేరే ఇప్పుడొక సూపర్ బ్రాండ్. జగనన్న అనే నాలుగ క్షరాలు ప్రభంజనానికి పర్యాయపదంగా మారిన వైనాన్ని మనం ఆంధ్రప్రదేశ్‌లో చూడవచ్చు. గనిలో వనిలో కార్ఖానాలో... అన్నట్టుగా ప్రతి జీవనరంగంలోనూ ఈ ప్రభంజనపు వికాసాన్ని మనం కాంచవచ్చు. ఊరూవాడ, పొలమూ పుట్ర, బడీగుడి, ఆస్పత్రీ ఆఫీసూ... ఇలా ప్రతిచోటా మారాకు తొడుగుతున్న మార్పులను మనం గమనించవచ్చు.
ఈ మార్పులు నిస్సహాయులను నిటారుగా నిలబెడు తున్నాయి. పేదవర్గాల భుజాలకు హక్కుల అమ్ములపొదులను తొడిగి సాయుధం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని కబ్జా చేసి తమను దగా చేసిన పెత్తందార్లపై యుద్ధానికి పేద వర్గాలను సమాయత్తపరిచేవిగా ఉన్నాయి. నాటి విప్లవకారులు పాడుకున్న పాటొకటి గుర్తుకొస్తున్నది. ‘‘విప్పపూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములు నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా... రాయలసీమ రాళ్లలోని రతనాలను మాలలల్లి నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా.’’ ఈ స్ఫూర్తిని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లో రాజ్య ప్రాయోజిత సాధికార రథయాత్రల్లో వీక్షించవచ్చు.
‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’... అంటూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవ త్సరాల ఏడు మాసాలు గడిచాయి. ముఖ్యమంత్రి హోదాలో వందలాది సభల్లో ఆయన పాల్గొన్నారు. జనం సమక్షంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నారు. వేలాదిమంది సహాయార్థులను విడివిడిగా కలిసి వారి బాధలు విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. ఇంతగా నిరంతరం జనంలో తిరుగాడినప్పటికీ ఆయన జనాకర్షణ చెక్కుచెదరలేదు. పైగా పెరిగింది.
ఆయన జనంతో మమేకమయ్యే వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో విస్తారంగా దొరుకుతాయి. సెల్ఫీలకోసం ఎగబడేవారు, లాఠీల నెదిరించి బ్యారికేడ్లు దూకేవాళ్లు, ‘జగనన్నా’ అంటూ ఎలుగెత్తేవాళ్లు, కిలోమీటర్ల పొడవునా రోడ్ల పక్కన, మిద్దెల మీద నిలబడి కేరింతలు కొట్టేవాళ్లు ఇప్పుడింకా పెరిగారు. వేలాదిమంది పాల్గొన్న సభల్లో జనతరంగ విన్యా సాలు, మెక్సికన్ వేవ్స్ ఇంకా కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వాల మీద అంతో ఇంతో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. మరోసారి టిక్కెట్ దొరకదని ఖాయంగా తెలిసినవాళ్లలో, సొంత పనులు చక్క బెట్టుకోవడం కుదరని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తున్నది కానీ, జనబాహుళ్యంలో మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ పిడికెడుమంది అసంతృప్తిపై వైడ్ యాంగిల్ వేసి చూపెడుతున్న యెల్లో మీడియా లక్షలాదిమంది సంతృప్తిపై సిరా మరకలు రుద్ది దాచేసే ప్రయత్నం చేస్తున్నది.
ప్రజాదరణ రేటింగ్ విషయంలో జాతీయ సంస్థల సర్వేల్లో జగన్‌మోహన్‌రెడ్డి దరిదాపుల్లో కూడా మన ‘ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్త్రీ’ లేరు. ‘ఇండియా టుడే’ వారు గత జనవరిలో చేసిన సర్వేలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదరణ 56 శాతంగా ఉంటే, ఈ డిసెంబర్‌లో 58 శాతానికి పెరిగింది. తాజా సర్వేల్లో మన విజనరీ లీడర్‌కు 36 శాతం, క్వశ్చన్ మార్క్ లీడర్‌కు 7 శాతం జనాదరణ ఉన్నట్టు తేలింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనం గుండెచప్పుళ్లు వింటే ఈ తేడా ఇంకా ఎక్కువగా తెలుస్తుంది.
371 కోట్ల రూపాయల ధనాన్ని సర్కారు ఖజానా నుంచి సొంతానికి దారి మళ్లించిన స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు యాభై రెండు రోజులు జైల్లో గడిపారు. ఈ జైలు జీవితం వల్ల రాష్ట్రంలో సానుభూతి గంగ ఉప్పొంగి ప్రవహిస్తుందని తెలుగుదేశం, యెల్లో మీడియాలు బోలెడు ఆశలు పెట్టు కున్నాయి. ‘టైమ్స్ నౌ’ వాళ్లు ఆయన జైల్లో ఉన్నæ సమయంలోనే సర్వే చేసి రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 గెలుచుకుంటుందని తేల్చేశారు. టీడీపీకి సున్నా నుంచి వస్తేగిస్తే ఒక సీటు రావచ్చని చెప్పారు. ఎన్నికల భాషలో దాన్నే ‘ఊడ్చేయడం’ అంటారు. ఇదీ వాస్తవ రాజకీయ పరిస్థితి.
కేవలం తెలుగుదేశం – జనసేన కలిసి పోరాడినంత మాత్రాన వైసీపీని ఓడించడానికి బలం చాలదు. సమస్త రాజ కీయ శక్తుల ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేలా చూడాలి. 50 శాతానికి పైగా ఉన్న వైసీపీ ఓట్లలో సాధ్యమైనంత మేరకు కోత పెట్టాలి. ఇప్పుడు బాబు కూటమి ఆ ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నది. వీళ్లవెంతటి వికృతమైన, జుగుప్సా కరమైన ఆలోచనలో పరిశీలించండి. తెలుగుదేశం – జనసేన కూటమికి బీజేపీ తోడవ్వాలి. మరోపక్క కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసి వీరి సలహాల మేరకు అవగాహనతో పని చేయాలి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహకారం అందించిన సంగతి బహిరంగ రహస్యమే. అందువల్ల రాహుల్‌తో ఏర్పడిన సత్సంబంధాలను ప్రస్తుత అవసరాలకు బాబు వినియోగించు కుంటున్నారని సమాచారం. 22 మంది ఏపీ కాంగ్రెస్ నాయ కులను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో ఢిల్లీ పెద్దలు ఏపీ కాంగ్రెస్ మీద ఈ మాత్రం శ్రద్ధ పెట్టడం ఇదే ప్రథమం.
ఏపీలో గెలవడం గురించి కంటే ఓట్ల శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారట! ఈ సందేశాన్ని చంద్రబాబు రాజకీయ భాషలోకి తర్జుమా చేస్తే వైసీపీ ఓట్లను చీల్చడం మీద దృష్టి పెట్టాలి. సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు రాజకీయ ఆలోచనలు ఈ విషయంతో పట్టాలు తప్పినట్టు మనకు బోధ పడుతున్నది.
ఎందుకంటే రెండు మూడు బలమైన ప్రతిపక్షాలు న్నప్పుడు ప్రభుత్వ నెగెటివ్ ఓటు చీలుతుంది. ఆ చీలికను నివారించడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు. అలా చీలిన దాఖలాలూ లేవు. కాంగ్రెస్ ద్వారా పాజిటివ్ ఓటును చీల్చాలనే బాబు ఆలోచన ఆయన నిస్పృహకు నిదర్శనంగానే భావించాలి.
ఢిల్లీ సమావేశంలో రాహుల్‌గాంధీ మరో సూచన కూడా చేశారు. పార్టీలోకి ఎవరు చేరుతానన్నా ఆహ్వానించాలనీ, అలా ఆహ్వానించకపోతే నష్టపోతామనీ హితవు చెప్పారట! ఏపీ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకొని ఒక్క శాతం ఓటు కూడా లేని దుఃస్థితికి చేరుకున్న పార్టీలో చేరడానికి పరుగు పరుగున వస్తున్న వారెవరో? ఎక్కడా టిక్కెట్ దొరక్క ఏదో ఒక బీ–ఫామ్ కోసం ఎవరైనా వస్తే రావచ్చు. ఇంకేదైనా తెర వెనుక వ్యూహంలో భాగంగా మరెవరైనా రావచ్చు. వారు చూపగలిగే ప్రభావం శూన్యం.
ఇక బీజేపీ కూడా తమ పొత్తులో భాగస్వామి కావాలన్న కోర్కె టీడీపీ – జనసేనలదే తప్ప బీజేపీది కాదు. పొత్తు కుదిరి పోయిందన్న ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తమున్నదని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. వారు అధిష్ఠానానికి ఈ మేరకు పిటిషన్లు పెడుతున్న మాట కూడా నిజమే!
అయితే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ జాతీయ నాయకుల నిశ్చితాభిప్రాయం. పొత్తును వారు ఇంత వరకూ ఆమోదించలేదు. కానీ చంద్రబాబు పార్టీ మాత్రం పొత్తు కుదిరిపోయిందన్న కథనాన్ని తయారుచేసింది. యెల్లో మీడియా విశ్వసనీయత అడుగంటిన నేపథ్యంలో ఈ కథనాన్ని నడప డానికి ఇంకో తటస్థ ఛానల్‌ను ఆ పార్టీ ఎంచుకున్నదని బీజేపీ వారి పరిశీలనలో తేలింది.
స్కోరింగ్‌ల మీద, బ్రేకింగ్‌ల మీద న్యూస్ ఛానెళ్లకు సహజంగా ఉండే ఆసక్తిని అవకాశంగా తీసుకుని, ఇది పక్కా సమాచారమని నమ్మబలికి, ఓ ప్రముఖ ఛానల్‌లో టీడీపీ కథనం ప్రసారమయ్యేట్లు వ్యూహాన్ని రచించారు. దీని వెనకో పిట్ట కథ ఉన్నది. మొన్న బెంగళూరు ఎయిర్‌పోర్టులో కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాంగ్ మ్యాన్ డీకే శివకుమార్, చంద్రబాబు తారస పడ్డారు. పక్కనున్న సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందికి దూరంగా వెళ్లి ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు.
బాబు గ్రహచారం బాగాలేక ఈ వార్త, ఫోటో మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. దాంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయట! దీన్ని పూర్వపక్షం చేయడం కోసం బీజేపీతో పొత్తు కహానీని సిద్ధంచేసి ఒక తటస్థ ఛానెల్‌పైకి గురిపెట్టి విసిరారు. ఈ కథనం ప్రకారం ఏపీ బీజేపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణలో టీడీపీతో పొత్తు వుండాలనే అంశానికి మద్దతు లభించిందట! దీనిపై రాష్ట్ర నాయకత్వం ఒక రిపోర్టు తయారుచేసి జాతీయ నాయకత్వానికి పంపించిందట!
ఇందులో బీజేపీకి పది నుంచి పన్నెండు, జనసేనకు 20 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారట! కన్నపు దొంగలు ఇక్కడే దొరికి పోయారు. నిజంగానే బీజేపీ వాళ్లు లేఖ రాస్తే జనసేనకు, తమకూ కలిపి ముచ్చెంగా 30 సీట్లే అడుగుతారా! కనీసం 70 సీట్లు అడిగేవారు. జనసేనకు 20 సీట్లే అని చెబుతున్న టీడీపీ వైఖరికి తగినట్టుగానే ‘బీజేపీ లేఖ’ ఉండటం ఆసక్తికరం.
ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని ఆపసోపాలు పడటానికీ, అగచాట్ల పాలవడానికీ కారణం క్షేత్రస్థాయి వాస్తవికత. నాలుగేళ్లలోనే ప్రజాజీవనంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొని రాగలిగింది. ఒకప్పుడు వ్యవసాయంలో చిన్న కమతాలు లాభదాయకం కాదనే వాదన ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చిన్న కమతాల రైతులు లాభాలు పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని దేవీందర్‌శర్మ జాతీయ పత్రిక ‘ట్రిబ్యూన్’లో ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశారు.
రైతు భరోసా కేంద్రాలపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పరిపాలనలో సంపూర్ణ వికేంద్రీకరణ, పారదర్శకత సాధించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. బలహీనవర్గాలకూ, మహిళలకూ అధికార హోదాలను కట్టబెట్టడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది.
దేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ స్కూళ్లలో అందజేస్తున్న విద్యను ఏపీ ప్రభుత్వం ఉచితంగా పేద బిడ్డలకు అందజేయ గలుగుతున్నది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఇంటినీ పరామర్శి స్తున్నది. రైతులకు వారి భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ దేశంలోనే తొలి అడుగును ఆంధ్ర ప్రదేశ్ వేసింది. మద్య నియంత్రణను అమలులోకి తెచ్చి బెల్టు షాపుల తాట తీసింది. నడివయసు దాటిన మహిళలకు చేయూతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసింది. లక్ష ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగు నీరిచ్చి మరో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరపరిచింది.
వైఎస్ జగన్ పరిపాలనలో బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వెనుకబాటుతనాన్ని ఛేదించుకొని ముందడుగు వేస్తున్నారు. ఇది గిట్టని పెత్తందారీ వర్గాలు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు చేస్తున్న రాజకీయ అవకాశవాద ప్రయోగాలను చూడాలి. ఇక పేదల ప్రభుత్వం మీద యెల్లో మీడియా విష వాయువులను ప్రయోగిస్తున్నది. కష్టజీవులందరూ పేదల ప్రభుత్వం వెనుక మరింత బలంగా సంఘటితం కావడమే ఈ విష ప్రచారాలకు విరుగుడు.
ప్రతి ఉదయం ఒక కొత్త రోజును ఆవిష్కరిస్తుంది. రేపటి ఉదయం మరో కొత్త సంవత్సరాన్ని ఆవిష్కరించబోతున్నది. సామాజిక – ఆర్థిక న్యాయ సాధనలో నాలుగేళ్లుగా పడుతున్న అడుగులకు కొత్త సంవత్సరం మరింత ఉత్తేజాన్నివ్వాలని కోరు కుందాం. పెత్తందారీ శక్తుల అవకాశవాద రాజకీయాలను చిత్తుచేస్తూ పేదల ప్రభుత్వానికి మరో అఖండ విజయం ఈ కొత్త సంవత్సరం ప్రసాదించాలని కాలచక్రాన్ని ముందుకు నడిపే ఉదయార్కుడైన సూర్యభగవానుని ప్రార్థిద్దాం. సప్తాశ్వ రథమారూఢం... ప్రచండం కశ్యపాత్మజం... శ్వేతపద్మధరం దేవం... తం సూర్యం ప్రణమామ్యహమ్!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
ఆ పేరే ప్రభంజనం!
Published Sun, Dec 31 2023 12:00 AM | Last Updated on Sun, Dec 31 2023 12:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment