వైమానిక దాడుల నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ధ్వంసమైన తమ ఇంట్లోంచి ఆకాశంవైపు భయంతో చూస్తున్న చిన్నారులు
పది రోజులైంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ప్రాంత తీవ్రవాద గ్రూపు హమాస్ జరిపిన దాడి తాలూకు ప్రకంపనలు ఆగేలా లేవు. హమాస్‌ను తుదముట్టిస్తామంటూ గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడి అంతకంతకూ తీవ్రతరమవుతోంది. భూతల దాడులకు దిగడానికి సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే గాజాను ఈ యూదు దేశం అష్టదిగ్భంధనం చేయడంతో అక్కడి పాలెస్తీనియన్లకు తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళయినా లేని పరిస్థితి.
ఆగని యుద్ధంలో ఇప్పటికి 2600 మందికి పైగా పాలస్తీనియన్లు, ఇరువైపులా కలిపి 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది వేల మందికి పైగా గాయపడ్డారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే తేడా లేకుండా, బాధితుల కనీసపాటి అవసరాలకు కూడా అక్కర లేకుండా అంతర్జాతీయ మానవతావాద చట్టానికి (ఐహెచ్‌ఎల్)కి నీళ్ళొది లేస్తున్న ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం చివరికి మానవ సంక్షోభంగా మారిపోయే సూచనలు న్నాయి. మానవతా దృక్పథం అవసరమనే అంతర్జాతీయ సమాజంలో ఇది ఆందోళన రేపుతోంది.
పాలస్తీనా జనాభా 23 లక్షలైతే, 11 లక్షల మంది పైగా పౌరులు ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇప్ప టికే ఉత్తర గాజా విడిచివెళ్ళారు. అంటే సగం మంది నిరాశ్రయులయ్యారు. గాజా నుంచి ఈజిప్టులోకి వెళ్ళేందుకు రాఫా మార్గం తెరిచేందుకు దౌత్య యత్నాలు జరుగుతుండడంతో మరింతమంది అటూ వెళ్ళవచ్చు. యుద్ధం సృష్టించిన ఈ బీభత్సంలో సొంత గడ్డ విడిచివెళ్ళాల్సిన దైన్యంలో పడిన వీరి జీవితకాలపు దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు? ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే, ఇప్పటికే తిండి, నీళ్ళు, విద్యుత్తు, ఇంధనం లేక అల్లాడుతున్న ప్రాంతంపై అది అమానుష దాడి. హమాస్ మాటేమో కానీ, అన్నెం పున్నెం ఎరుగనివారు బలైపోతారు. ఐరాస ప్రతినిధి అన్నట్టు అది సామూహిక ఉరిశిక్ష వేయడమే! ‘ఆరుబయలు కారాగారం’గా పేరుబడ్డ గాజా ‘ఆరు బయలు శవాగారం’ అవుతుంది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడినీ, వందలమంది మరణానికి కారణమైన తీరునూ, అమాయకు లను బందీలుగా తీసుకెళ్ళిన వైనాన్నీ మానవతావాదులు ఎవరూ సమర్థించరు. కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నదేమిటి? ఆత్మరక్షణ ధోరణిని అతిక్రమించి, గాజాను తుడిచిపెట్టేయాలనీ, పాల స్తీనాను ఉనికిలో లేకుండా చేయాలనీ తెగబడుతున్న తీరును ఏమనాలి? ఒకప్పుడు సురక్షితంగా బతకడానికి తమకంటూ ఓ దేశం కావాలని మొదలైన యూదులు నాటి సువిశాల ఒట్టోమన్ సామ్రా జ్యంలో పాలస్తీనా ప్రావిన్స్‌లో భూములు కొనడంతో ఆరంభించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల్లో చివరకు పాలస్తీనా విభజనకూ, 1948లో స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుకూ కారణమయ్యారు. ఆనాడు పాలస్తీనాకు యూదులు వలసొస్తే, ఈనాడు పాలస్తీనియన్లు వలస పోతున్న పరిస్థితి. రావణకాష్ఠంలా సాగుతున్న పాలస్తీనా అంశంలో ఇరుపక్షాల తప్పులూ కొల్లలు.
ఇజ్రాయెల్ – పాలస్తీనా అంశాన్ని ముస్లిమ్ – యూదు సమస్యగా చిత్రీకరించి, అగ్నికి ఆజ్యం పోస్తున్న ఇరుపక్షాల దేశాలకూ చివరకు స్వప్రయోజనాలే కీలకం. పెదవులపై సానుభూతి, ఆయుధాలు అందించి యుద్ధాన్ని పెద్దది చేయడంతో పెరిగే మంటలు ప్రజలకు పనికిరావు. గాజా కేవలం 41 కి.మీ.ల పొడవాటి చిన్న భూభాగమే కావచ్చు. దాన్ని కైవసం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ ఆకాంక్ష నెరవేరడం సులభమేమీ కాదు.
గతంలో 2009లో 15 రోజులు, 2014లో 19 రోజులు గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేయకపోలేదు. అన్నిటికీ యుద్ధం పరిష్కారమైతే అనేక సమస్యలు ఏనాడో పరిష్కరమయ్యేవి. పాలస్తీనియన్లలో 44 శాతం మంది 2006లో తీవ్రవాద హమాస్‌కు ఓటు వేసి తప్పు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అన్నీ కోల్పోయి, భవితపై ఆశ లేని దుఃస్థితికి వచ్చారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోదామన్నా అభ్యంతరం చెబుతూ, అమాయకులైన వారినే హమాస్ అడ్డం పెట్టుకొంటున్న వార్తలు విచారకరం.
ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం తక్షణం ఆగేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాలి. బాధితులకు తక్షణ సాయం, శాంతిస్థాపన తక్షణ కర్తవ్యం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలిపోయి మాట్లాడుతున్నాయి. అయితే, హమాస్ దాడితో వచ్చిన సానుభూతి క్షీణిస్తూ, విమర్శలు పెరగడాన్ని ఇజ్రాయెల్ సైతం గమనిస్తోంది. గాజాకు అత్యవసర సాయం అందేందుకు దోవ ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతెన్యాహూ అన్నట్టు తాజా వార్త. అలాగే, దాడులు ఆపేస్తే ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెడతానందని ఇరాన్ మాట. హమాస్ నుంచి ఆ మేరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, యుద్ధాన్ని ఆపే అలాంటి కనీస ప్రయత్నాలు అత్యవసరం.
మన సంగతికొస్తే, మునుపటితో పోలిస్తే భారత ఆర్థిక సౌభాగ్యానికీ, జాతీయ భద్రతకూ ఇటీవల అతి కీలకమైన మధ్యప్రాచ్యంపై దేశంలో అధికార, ప్రతిపక్షాలు దేశీయంగా హిందూ, ముస్లిమ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మానాలి. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, క్రమం తప్పకుండా సమావేశమై, మారుతున్న పరిస్థితుల్నీ, మన దేశం అనుసరిస్తున్న వ్యూహాన్నీ ఎరుకపరచాలి. సంక్షోభం ముదురుతున్న వేళ సమతూకమే భారత మంత్రం.
యుద్ధంలో మానవీయ చట్టాలను గౌరవించాల్సిందిగా ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేయాలి. హమాస్ దుశ్చర్యకు గాజాలో అమాయకులపై ప్రతీకారం అర్థరహితమని నచ్చజెప్పాలి. అలాగే, హమాస్ వద్ద బందీలైన ఇజ్రాయెలీలను వెంటనే విడిపించేందుకు అరబ్ మిత్ర దేశాలు పాటుపడేలా కృషి చేయాలి. అటు ఇజ్రాయెల్‌తోనూ, ఇటు ఇరాన్, ఖతార్ మొదలు సౌదీ అరేబియా, ఈజిప్ట్ దాకా మధ్యప్రాచ్యంలోని కీలక దేశాలతోనూ ఉన్న సత్సంబంధాల రీత్యా భారత్ ఈ యుద్ధానికి తెరపడేలా చూడాలి. మధ్యప్రాచ్యాన్ని కమ్ముకొస్తున్న మానవ సంక్షోభాన్ని నివారించాలి.
Comments
Please login to add a commentAdd a comment