ఇంగ్లిష్‌లో ‘ఆల్ వెదర్ ఫ్రెండ్స్’ అనే మాట వుంది. అన్ని సమయాల్లోనూ మనతో నిలబడే స్నేహితుల గురించి చెప్పినమాట అది. మిత్ర దేశమైన మనల్ని ఈ కరోనా కష్టకాలంలో అమెరికా దూరం పెట్టిందని ఇటీవల విమర్శలొచ్చాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడే ముడి పదార్థాలను మనకు ఇవ్వడానికి ఆ దేశం నిరాకరించడం అందుకు కారణం. అప్పటినుంచీ ఆ దేశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యలే వచ్చాయి. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి కూడా డొనాల్డ్ ట్రంప్ గెలిచి పోవాలని బలంగా కోరుకున్నవారు పనిలో పనిగా ‘ఆయనే వుంటేనా...’ అంటూ ట్వీట్లు చేశారు. కొందరైతే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఉదారవాదులపై ‘మరి ఇప్పుడేం చెబుతారు...’ అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొందరు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మూలాలు మరిచారంటూ ఎత్తిపొడిచారు. భారత్ పేరు చెప్పి డెమొక్రాటిక్ పార్టీకి దండిగా ఓట్లు రాబట్టి ఇప్పుడు మౌనంగా వుండి పోయారని విమర్శించారు. రెండు ప్రభుత్వాల మధ్య సాగిన దౌత్య ఫలితమో, భారత ప్రజల్లో తమపై వ్యతిరేకత అలుముకుందన్న అభిప్రాయమో... మొత్తానికి అమెరికా తన వైఖరిని మార్చుకుంది. మన దేశం కోరినట్టు వ్యాక్సిన్ ముడిపదార్ధాల సరఫరాకు అమె రికా అంగీకరించింది. అంతేకాదు... ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు కూడా అందిస్తామని తెలియ జేసింది. కష్టకాలంలో అమెరికాకు సాయపడినందుకు మీకూ అదేవిధంగా సాయం చేయదల్చుకు న్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతూ చెప్పారని అంటు న్నారు. మొత్తానికి వారం పదిరోజులుగా ఈ విషయంలో వినబడిన చిటపటలు సర్దుకున్నాయి. సాధారణంగా దౌత్యపరమైన అంశాలను ప్రజానీకం పట్టించుకోరు. ఇందుకు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కొంత మినహాయింపు. శ్రీలంకలో తమిళులపై లేదా వారి తరఫున పోరాడిన తమిళ టైగర్ సంస్థపై అక్కడి ప్రభుత్వం నిర్బంధాన్ని అమలు చేసినప్పుడల్లా తమిళనాడులో ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ఆ దేశంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చేది. అలాగే తీస్తా నదీజలాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ బెంగాల్‌లో ప్రజాగ్రహం పెల్లుబుకడం రివాజు. ఇటీవలకాలంలో అన్ని దేశాల్లోనూ జాతీయవాదం బాగా పెరిగి దౌత్యసంబం ధాలను ప్రభావితం చేస్తున్నది. ట్రంప్ అధ్యక్షుడిగా వున్నప్పుడు వీటి ప్రభావంతోనే ఆయన నిర్ణ యాలు తీసుకునే ప్రయత్నం చేసేవారు, మాట్లాడేవారు. తన మద్దతుదార్లను సంతృప్తిపరచడానికి వున్నట్టుండి చైనాపై విరుచుకుపడేవారు. కానీ అధ్యక్షుడిగా అక్కడి బహుళజాతి సంస్థల ప్రయో జనాలను కాపాడటం కోసం భిన్న సందర్భాల్లో ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మళ్లీ కొన్నాళ్లకు అవసరం పడిందనిపిస్తే చైనాపై విమర్శలు చేసేవారు. ఎంతో సన్నిహితంగా వున్నామని మనల్నేమీ వదల్లేదు. ముఖ్యంగా ఖరీదైన ద్విచక్ర వాహనం హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై మన దేశం విధించిన సుంకాలను రద్దు చేయించడానికి ఆయన సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయో గించారు. ఒకటికి పదిసార్లు చర్చలు జరిపారు. వినలేదని అలిగారు. ఆఖరికి ఒక సమావేశంలో మోదీని ఆ బైక్‌పై సుంకాలు ఎత్తివేయమని అడిగినప్పుడల్లా ఆయన జవాబిచ్చే తీరును అనుకరిస్తూ అవహేళన చేసేందుకు ప్రయత్నించారు. వినలేదని చివరకు మన ఉత్పత్తులపై అక్కడ భారీ సుంకాలు విధించారు. ప్రతిగా మన దేశం కూడా అమెరికా వస్తువులపై సుంకాల శాతం పెంచింది.
దౌత్య సంబంధాలెప్పుడూ సరళరేఖ మాదిరి వుండవు. దేశాధినేతల రాజకీయ దృక్పథాలు, దేశ ప్రజానీకం మనోభావాలు ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటాయి. ఆమేరకు హెచ్చుతగ్గులుం టాయి. అదే సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడటం, వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడటం పాలకులకు ముఖ్యం గనుక వాటిని సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతిపై ఆంక్షల విషయంలో బైడెన్ ప్రభుత్వానికి తన కారణాలు తనకు వుండొచ్చు. మన దేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు, సాయం చేయడానికి రష్యా, చైనా, బ్రిటన్ వంటివి ముందుకు రావడం చూశాక వెనక్కు తగ్గివుంటుంది. వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు. ఒకరి బాధను మన బాధగా పరిగణించి ఆదుకోవడానికి ముందుకు ఉరకటం తప్పదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విషయంలో సమస్య మనది కాదు కదా అనుకునే పరిస్థితి లేదు. వ్యాపార వ్యవహారాల కోసం దేశాల మధ్య నిత్యం రాకపోకలు తప్పనిసరైనప్పుడు వేరే దేశం గురించి మనకెందుకని ఉపేక్షించే వీలుండదు. ఆ మాటెలావున్నా ముడిపదార్థాల ఎగుమతులను అనుమతించబోమన్న నిర్ణయంపై వ్యక్తమైన ఆగ్రహావేశాలు సాధారణ స్థాయిలో లేవు.
అయితే దీనితో అయిపోలేదు. కరోనా వ్యాక్సిన్ల పేటెంట్లను సడలించే అంశాన్ని పరిశీలించాలి. మన దేశమే కాదు.. ఏ దేశమైనా దాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుని, తన పౌరులకందించే వీలుం డాలి. అది జరిగినప్పుడే విశ్వవ్యాప్తంగా అందరికీ ఈ మహమ్మారినుంచి విముక్తి లభిస్తుంది. ఇంత మాత్రం చేత మనం ఇతరేతర అంశాల్లో అమెరికా చేసే ప్రతిపాదనలను అంగీకరించాల్సిన పనిలేదు. ఆ దేశంతో వున్న స్నేహసంబంధాలను పెంపొందించుకుంటూనే మన ప్రయోజనాలే గీటు రాయిగా ఏ నిర్ణయాన్నయినా తీసుకోవాలి. చైనాతో, రష్యాతో తనకుండే సంబంధాలనుబట్టి మనల్ని ఆ దిశగా ప్రభావితం చేయడానికి అమెరికా ప్రయత్నించినప్పుడల్లా స్వీయ ప్రయోజనాలే మన నిర్ణయాలకు గీటురాయి కావాలి.
దిగొచ్చిన అమెరికా
Published Thu, Apr 29 2021 12:31 AM | Last Updated on Thu, Apr 29 2021 3:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment