దాదాపు 12 రోజుల దారుణ మారణ హోమం ముగిసింది. ఎప్పటిలాగే ఈజిప్టు చొరవతో ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాడులు మొదలైన ప్పుడు ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందంటూ వెనకేసుకురావడమే కాక, భద్రతా మండలిలో దానికి అండగా నిలిచిన అమెరికా చివరకు వైఖరి మార్చుకుని తెరవెనక పావులు కదిపి ఈ కాల్పుల విరమణ ఒప్పందం సాకారమయ్యేలా చూసింది. కానీ ఈలోగా గాజా స్ట్రిప్‌లో 230మంది పౌరులు బలయ్యారు. 1,700మంది గాయపడ్డారు. రెండు వేలకుపైగా భవంతులు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ఎందరినో పోగొట్టుకుని, ఆప్తుల్లో అనేకులు ఆసుపత్రుల పాలై విలపించే కుటుంబాలకు లెక్కలేదు. ఎటు చూసినా ఘర్ష ణలు మిగిల్చిన విధ్వంసమే. మొత్తం 60,000 మంది పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సివచ్చింది. పాలస్తీనాలో ఎన్నో దశాబ్దాలుగా ఈ దృశ్యాలు పున రావృతమవుతూనే వున్నాయి. తాను ‘ఉగ్రవాద సంస్థల’ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నానని, వారి సైనిక సంపత్తిని దెబ్బతీస్తున్నానని ఇజ్రాయెల్ చెబుతూ వుంటుంది. అయితే గతంతో పోలిస్తే ప్రతిఘటన పెరిగింది. ఈసారి హమాస్ దాడులకు ఇజ్రాయెల్‌లో ఒక భారతీయ యువతితోసహా 12మంది మరణించారు. ఎవరు ప్రేరేపించారు...ఎవరు రెచ్చి పోయారన్న అంశాల్లో ఎప్పుడూ భిన్న దృక్పథాలుంటాయి. అయితే ఘర్షణలు చెలరేగినప్పుడు మొదటగా తగ్గవలసింది ఎప్పుడూ బలమైన పక్షమే. డోనాల్డ్ ట్రంప్ హయాంలోనైనా, అంతకు ముందు పాలించిన రిపబ్లికన్ అధ్యక్షుల సమయంలోనైనా అమెరికా ఎప్పుడూ ఇజ్రా యెల్‌కు మద్దతుగా నిలిచేది. డెమొక్రాట్లు మాత్రం కొంత ఊగిసలాట వైఖరితో ఇరుపక్షాలకూ శాంతి ప్రబోధం చేయడం రివాజు. ట్రంప్ సృష్టించిన వాతావరణం వల్ల కావొచ్చు... ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం శాంతికి పిలుపునిస్తూనే ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని మొదట్లో చెప్పారు. బహుశా స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చివరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో దాదాపు అరడజనుసార్లు మాట్లాడి కాల్పుల విరమణకు సిద్ధపడాలని ఒత్తిడి చేశారు. ఒకప్పుడు మన దేశం ఇజ్రాయెల్ చర్యలను గట్టిగా ఖండించేది. ఐక్యరాజ్య సమితిలో దానికి వ్యతిరేకంగా గళమెత్తేది. కానీ ఆ రోజులు పోయాయి. 2014 తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ చేసిన మొదటి భారీ దాడి కనుక మన ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుం దోనన్న ఆసక్తి ప్రపంచ దేశాలన్నిటా వుంది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించ డంతోపాటు, ఇజ్రాయెల్ జరిపిన ‘ప్రతీకారదాడుల్ని’ కూడా భారత్ గతవారం నిరసించింది. వాటివల్ల భారీ సంఖ్యలో జననష్టం జరిగిందని, మహిళలు, పిల్లలు అనేకులు మరణించారని ప్రస్తావించింది. కానీ ఇజ్రాయెల్‌కు ఇది రుచించలేదు. అందుకే తమకు మద్దతునిచ్చిన దేశాలకు ట్విటర్‌లో కృతజ్ఞతలు చెప్పిన నెతన్యాహూ మన దేశం ఊసెత్తలేదు.
పాలస్తీనా విషయంలో అమెరికా అనుసరిస్తూ వస్తున్న విధానమే ఇజ్రాయెల్‌కు బలంగా మారుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం వుంటే...రష్యా, చైనాలకు కూడా పరిష్కార సాధనలో చోటిస్తే ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా పోయేది కాదు. పాలస్తీనా ఈసరికే పూర్తి రాజ్య ప్రతిపత్తితో మనుగడ సాగించేది. పశ్చిమాసియాలో తన సైనిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడి చెక్కుచెదరకూడదనుకుంటే ఇజ్రాయెల్‌ను గట్టిగా సమర్థించడమే మార్గమని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో గాజా స్ట్రిప్‌లో హమాస్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలో తోచని ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా అక్కడి జనావాసాలపై దాడులు చేస్తోంది. భయకంపితులైన జనాలు సహజంగానే హమాస్‌పై తిరగబడి, దాన్ని కట్టడి చేస్తారని ఇజ్రాయెల్ వ్యూహం. నిరాయుధులైన పౌరులపై చేస్తున్న దాడులకు జవాబుదారీతనం వహించాల్సిందేనన్న ఒత్తిడి లేనంతకాలం అది ఈ వ్యూహాన్నే అమలు చేస్తుంది. భద్రతా మండలిలో ఎవరు తనకు వ్యతిరేకంగా నిలిచినా, అమెరికా తనకు అండగా నిలబడుతుందన్న భరోసా ఇజ్రాయెల్‌కు వుంది. అది పోగొట్టినప్పుడే పాలస్తీనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నానని, సౌదీ అరేబియాతో మరింతగా స్నేహసంబంధాలు ఏర్పడ్డాయని, ఇక ఇరాన్ కట్టడికి పకడ్బందీ వ్యూహం రూపొంది స్తున్నానని నెతన్యాహూ జబ్బలు చరుచుకున్నారు. కానీ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ రాకెట్ దాడులు చేస్తున్న సమయంలోనే అరబ్, ఇజ్రాయెల్ పౌరుల మధ్య మత ఘర్షణలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులతో వేలాదిమంది నిరసనకారులు తలపడటం గమనిస్తే అక్కడ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రతిఘటన యధాతథంగా వుందని అర్ధమవుతుంది. కనుకనే తమకు వాస్తవమైన శాంతి కావాలని ఇజ్రాయెల్ పౌరులు కోరుకుంటున్నారు. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా ఆక్రమిస్తూ వస్తున్న ప్రాంతాలనుంచి వైదొలగి, పాలస్తీనాతో శాంతియుత ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధపడినప్పుడే ఆ ప్రాంతంలో ప్రశాంతత సాధ్యమవుతుంది. ఇప్పుడు జరిగిన దురదృష్టకర పరిణామాలు ఆ దిశగా అడుగులు పడేందుకు దోహదపడాలని ఆశించాలి.
శాంతికి బాటలు పడాలి
Published Mon, May 24 2021 1:11 AM | Last Updated on Mon, May 24 2021 1:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment