రక్షకభట వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలంటూ ఇటీవల గుజరాత్ పర్యటనలో ప్రధాన మంత్రి మోదీ అన్న మాటలు పోలీసు సంస్కరణల అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారితో కఠినంగా ఉంటూ, సమాజంతో స్నేహంగా ఉండడం రక్షకులకు ఆదర్శం. కానీ, ఇవాళ అందుకు భిన్నంగా ఉందన్నది చేదు నిజం. ఆ తప్పుకు కారణం పోలీసు ప్రవర్తనతో పాటు పాలకుల రాజకీయ జోక్యం! వలస పాలన నాటి వేధింపు ధోరణికి దూరంగా – పోలీసంటే జనానికి మిత్రుడనే అభిప్రాయం కలిగించాల్సిన అమృతకాలం మించిపోతున్నట్టు పాలకులు గుర్తించడం సంతోషం. చేపట్టాల్సిన చర్యలే చాలాకాలంగా మిగిలి ఉన్నాయి.
గడచిన 20 ఏళ్ళలో దేశంలో 1888 కస్టడీ మరణాలు జరిగితే, కేవలం 26 మంది పోలీసులే శిక్షకు గురయ్యారు. ఒక్క 2020లోనే 76 కస్టడీ మరణాలు సంభవించాయి. అందులో 15 కేసులతో గుజరాత్‌దే అగ్రాసనం. నిజానికి, 1860లలో చేసిన చట్టం భారత పోలీసు వ్యవస్థకు మూలం. చాలాకాలంగా మార్పుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలను సూచించాలంటూ, 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం ‘జాతీయ పోలీసు కమిషన్’ను పెట్టింది. 1978 నవంబర్ – 1981 మే మధ్య ఆ కమిషన్ 8 నివేదికలిచ్చింది. ఇక, మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రెబీరో, కేంద్ర హోమ్‌శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య సహా పలువురు నిపుణుల కమిషన్లు వచ్చాయి. అవీ అనేక సంస్కరణల్ని సూచించాయి. వాటిలోనూ చాలాభాగం ఆచరణకు నోచుకోనే లేదు.
దశాబ్దిన్నర క్రితం వచ్చిన ప్రకాశ్‌సింగ్ కేసు తీర్పు పోలీసు సంస్కరణల్లో చిరస్మరణీయ ఘట్టం. డీజీపీగా పని చేసిన ప్రకాశ్ సింగ్ తన పదవీ విరమణ తర్వాత పోలీసు శాఖలో సంస్కరణలు కోరుతూ 1996లో సుప్రీమ్ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. పదేళ్ళ తర్వాత 2006 సెప్టెంబర్‌లో న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిస్తూ, పోలీసు సంస్కరణలు తేవాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ నిర్దేశించింది. రాజకీయ జోక్యాల బాదరబందీ లేకుండా పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అనేక చర్యలతో పాటు 7 ప్రధాన అంశాలను కోర్టు తన ఆదేశంలో పేర్కొంది. ఆ తీర్పు నాటి నుంచి 2020 లోపల దేశంలో 18 రాష్ట్రాలు తమ పోలీసు చట్టాలను ఆమోదించడమో, సవరించడమో చేశాయి. అవేవీ కోర్టు చెప్పినదానికి అనుగుణంగా లేవు. నేటికీ దేశవ్యాప్తంగా పోలీసుల బదలీలు, నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గనేలేదు. గత మార్చిలో మహారాష్ట్రలో పలువురు ఐపీఎస్‌లు లాబీయింగ్‌తో పోస్టింగులు పొందుతున్నారని ఆరోపణలు రావడం వ్యవస్థ మారలేదనడానికి నిదర్శనం.
సుప్రీమ్‌కోర్టు అనేకమార్లు జోక్యం చేసుకున్నా, ఇవాళ్టికీ థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, జైళ్ళలో మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలకుల పనుపున లాకప్ హత్యలు, ఎన్‌కౌంటర్లు ఆగనేలేదు. నాణేనికి రెండో కోణం– సిబ్బంది కొరతతో, వేళాపాళా లేని పోలీసుల విధినిర్వహణ కష్టాలు. దేశంలో ప్రతి లక్ష మందికీ 222 మంది పోలీసులు ఉండాలన్నది ఐరాస సిఫార్సు కాగా, తీరా మన దగ్గర ఉన్నది అందులో సగాని కన్నా కాస్త ఎక్కువగా 137 మందే! రాష్ట్రాల పోలీసు విభాగాల్లో మంజూరైన పోస్టుల్లో 5.3 లక్షలు భర్తీ కాకుండా ఉన్నాయట. నూటికి 44 మంది పోలీసులు రోజుకు 12 గంటలు పని చేస్తుంటే, ప్రతి ఇద్దరిలో ఒకరికి వారాంతపు సెలవే ఉండట్లేదు. విధిలో ఉన్నవారిపై ఒత్తిళ్ళు సరేసరి. ఈ పరిస్థితుల్లో నేరాలు జరిగినప్పుడు తక్షణ న్యాయం అందించే వ్యవస్థ నేటికీ దేశంలో కరవే. నేర, శ్రామిక, సివిల్ వివాదాలు వస్తే వాటి పరిష్కారం అంత తేలిక కాదు. మన దేశంలో వస్తూత్పత్తి, వాణిజ్య రంగాల్లోకి రావడానికి విదేశీ సంస్థల అనాసక్తికి కారణం అదే. దాని ప్రభావం మన దేశంపై ఆర్థికంగా భారీగా పడింది. 1987 నాటికి మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి దాదాపు సమానమైన చైనా గత ఏడాదికి 5 రెట్లు మించిందంటే, ఇలాంటి మన లోపాలే మూలం.
మహిళలపై దాడుల కేసులు దాదాపు పాతిక వేలు, అత్యాచారం కేసులు 12 వేలు, వరకట్న మరణాలు 4 వేలకు పైగా అయిదు నుంచి పదేళ్ళుగా పెండింగ్‌లోనే ఉన్నాయని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్క. సాంకేతికత పెరిగి, ఇ–పోర్టల్స్ వచ్చినా పాస్‌పోర్టులు, నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీల) జారీ లాంటి అనేక ప్రాథమిక సేవలకూ జాప్యం జరుగుతోంది. మాటలతో సరిపుచ్చ కుండా ఈ లోపాలను సవరించడానికి పాలకులు ఆచరణలోకి దిగాలి. శిక్షణ రోజుల నుంచే పోలీ సుల్లో జనస్నేహ ధోరణిని పెంపొందించడం అవసరం. పోలీసులపై ప్రజల ఫిర్యాదుల్ని విచారించే ‘పోలీస్ కంప్లయింట్స్ అథారిటీస్’ పెట్టాలన్న సుప్రీమ్ మార్గదర్శకాన్ని ఇకనైనా అమలు చేయాలి.
పోలీసు శాఖను మానవీయంగా, బదలీలు – నియామకాలను పారదర్శకంగా మార్చే సదాలోచనను అందిపుచ్చుకోవడం అవసరమని నిపుణుల మాట. రాష్ట్రాలన్నీ తమ స్థానిక అవసరాలు, ఆలోచనలు, పరిస్థితులకు తగ్గట్టు మార్పు చేసుకొనే వీలుండేలా, అఖిల భారత స్థాయిలో ఓ నమూనా చట్టం తేవాలని వారి వాదన. నిజానికి, పోలీసు విభాగం రాష్ట్ర జాబితాలోది. కానీ, సమాఖ్య స్ఫూర్తికి భంగం వాటిల్లని రీతిలో, దిశానిర్దేశం చేస్తే ఫరవా లేదు. ఏమైనా, పాలకులు, పోలీసులు గుర్తుంచుకోవాల్సింది – క్షణాలలో స్పందించి, ఆపదలో ఆదుకుంటారన్న భరోసా కలిగిస్తేనే... రక్షక భటులనే పేరుకు సార్థక్యం. పోలీసులు స్వేచ్ఛగా, సంతోషంగా, నిర్భయంగా పనిచేసేలా రాజకీయ జోక్యం నివారించడమే పాలకుల కర్తవ్యం.
సుదీర్ఘ నిరీక్షణలో సంస్కరణ!
Published Tue, Mar 15 2022 11:27 PM | Last Updated on Tue, Mar 15 2022 11:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment